KTR Meeting With BRS Leaders in Chevella : త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు (LokSabha Elections 2024) పార్టీ నేతలు, శ్రేణులను సిద్ధం చేసేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సిద్ధమవుతోంది. మెజార్టీ స్థానాలను దక్కించుకోవడం ద్వారా సత్తా చాటాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమిని విశ్లేషించుకుంటూనే, తదుపరి ఎన్నికల సన్నాహంపై అంతర్గతంగా కసరత్తు ప్రారంభించింది.
BRS Focus on LokSabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ నేతలకు సూచించారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ నేతలతో తెలంగాణ భవన్‌లో ఆయన సమావేశమయ్యారు. ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు సమావేశానికి హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్న కేటీఆర్ అందుకు సమాయత్తం కావాలని చెప్పారు.
శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నేతలను ఆదేశించారు. జనవరి 26వ తేదీలోపు నియోజకవర్గాల వారీ సమావేశాలు పూర్తి చేసుకోవాలని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దన్న కేటీఆర్, ఓటమి పాలైన బీఆర్ఎస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లని స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని తెలిపారు.
లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - పోటీకి సిట్టింగ్, మాజీ ఎంపీలు, మాజీ మంత్రుల ఆసక్తి
KTR Review Meeting With Chevella BRS Leaders : శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. చేవెళ్ళ ఎంపీ అభ్యర్థిగా తనను పోటీ చేయమని కేటీఆర్ చెప్పారన్న రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశానిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అని అన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, అయితే ఏమీ చేయలేదని కాంగ్రెస్ చెప్పడం అసత్యమని ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 412 హామీలు ఇచ్చిందని వాటిని నెరవేర్చలేదని రంజిత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలో బీఆర్ఎస్కు శాసనసభ ఎన్నికల్లో లక్షా తొమ్మిది వేల మెజారిటీ వచ్చిందని ఎంపీ ఎన్నికల్లో అంత కంటె ఎక్కువ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కాంగ్రెస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయని అన్నారు.
''చేవెళ్ల పార్లమెంటుపై కేటీఆర్ సమీక్షించారు. నన్ను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కాంగ్రెస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెడతాం''- ఎంపీ రంజిత్ రెడ్డి
బీఆర్ఎస్ హయాంలో 50 లక్షల కోట్ల సంపద సృష్టించాం - కావాలని బద్నాం చేస్తున్నారు : కేటీఆర్
దేశానికి టార్చ్ బేరర్‌గా మారిన తెలంగాణ జ్యోతిని ఆరిపోనివ్వం : కేటీఆర్