టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై(TPCC Revanth reddy) తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (minister KTR) సిటీ సివిల్ కోర్టులో పరువునష్టం(defamation) దావా వేశారు. మాదకద్రవ్యాల కేసుతో ముడిపెడుతూ రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారని పిటిషన్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలను పరువునష్టం చర్యలుగా పరిగణించి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పేలా రేవంత్ రెడ్డిని ఆదేశించాలని సిటీ సివిల్ కోర్టును కేటీఆర్ కోరారు. పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలన్నారు. తన పరువుకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను ట్విటర్, ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా రేవంత్‌ను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఈడీ డ్రగ్స్ కేసుతో ముడిపెడుతూ తనపై తప్పుడు, పరువునష్టం వ్యాఖ్యలు చేయకుండా రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులను నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
మరిన్ని వివరాలు సేకరిస్తున్నాం
రేవంత్ రెడ్డి నుంచి పరువునష్టం పరిహారం కోరేందుకు అవసరమైన మరిన్ని వివరాలను సేకరిస్తున్నామని.. దానిపై తగిన సమయంలో కోర్టును కోరతానని పిటిషన్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. ఈడీ డ్రగ్స్ కేసుతో తనకెలాంటి సంబంధం లేకపోయినా ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. మంత్రిగా, తెరాస నేతగా తనకు రాష్ట్రంతో పాటు దేశ, విదేశాల్లో పేరు, ప్రతిష్టలున్నాయన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీసేలా రేవంత్ ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. క్రిమినల్ కేసులను రాజకీయ ప్రత్యర్థుల పరువు, ప్రతిష్టను దెబ్బతీసేందుకు వాడుకోరాదన్నారు. తనకు ఏ దర్యాప్తు సంస్థ నుంచి నోటీసులు రాలేదని తెలిపారు. రేవంత్ రెడ్డి దురుద్దేశంతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు కార్యాలయం పరిశీలనలో ఉంది.
ఇదీ చూడండి: White challenge issue: న్యాయస్థానంలో పరువునష్టం దావా దాఖలు చేశా: కేటీఆర్