పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆ శాఖ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావును మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో సన్మానించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కారాల కింద రాష్ట్రానికి 12 అవార్డులు వచ్చినందుకు వారిని అభినందించారు. రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలా పనిచేస్తున్నారన్న కేటీఆర్... వరుసగా అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బందిని అభినందించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్నంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి నెలా పంచాయతీలకు ఇస్తున్న 308కోట్ల రూపాయలు గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్నాయని అన్నారు. దేశంలోనే మొదటి సారిగా తెలంగాణలో అసలైన గ్రామ స్వరాజ్య స్థాపన సీఎం కేసీఆర్ హయాంలో జరుగుతోందని తెలిపారు. అన్నీ సమకూరడంతో పాటు నిత్యం పారిశుద్ధ్య నిర్వహణతో గ్రామాలు అద్దాల్లా తయారయ్యాయని చెప్పారు. గ్రామాల్లో కరోనా వ్యాప్తి తగ్గడమే కాకుండా సీజనల్, అంటువ్యాధుల జాడ లేకుండా పోయిందన్నారు. ఇదే తరహా పనితీరుని కొనసాగించాలని, రాష్ట్రానికి మరింత పేరు వచ్చేలా పని చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
ఇదీ చదవండి: కేసుల పెరుగుదల సెకండ్ వేవ్‌కు ప్రారంభ సూచిక: శ్రీనివాసరావు