శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల వద్ద జలవిద్యుత్ ఉత్పత్తి ఆపాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB) తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు బోర్డు సభ్యుడు మౌంతాంగ్ తెలంగాణ జెన్కో సంచాలకులకు లేఖ రాశారు. గ్రిడ్‌కు అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా నీరు విడుదల చేయవద్దని గతంలోనే స్పష్టం చేశామన్న కేఆర్ఎంబీ... తెలంగాణ ఇంకా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తోందని ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. తాగు, సాగునీటి అవసరాలకు దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం, నాగార్జునసాగర్, పులిచింతల వద్ద విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి విడుదల ఆపాలని జెన్కోను కోరింది.
ఆర్డీఎస్ కుడికాల్వ పనులు చేపట్టవద్దు...
ఆర్డీఎస్ (RDS) కుడి కాల్వ పనులు కొనసాగించవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కృష్ణానదీ యాజమాన్య బోర్డు కోరింది. ఈ మేరకు బోర్డు సభ్యకార్యదర్శి హరికేష్ మీనా ఏపీ ఈఎన్సీకి లేఖ రాశారు. ప్రాజెక్టు డీపీఆర్ బోర్డుకు ఇంకా అందలేదన్న కేఆర్ఎంబీ... ఆర్డీఎస్ కుడికాల్వ పనులు కొనసాగుతున్నాయని తెలంగాణ ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.
బోర్డుకు డీపీఆర్ ఇవ్వకుండా, ఆమోదం పొందకుండా పనులు కొనసాగించవద్దని కోరింది. అటు చిన్ననీటివనరుల నీటివినియోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చేసిన ఫిర్యాదుపై అభిప్రాయం చెప్పాలని బోర్డు తెలంగాణను కోరింది. తెలంగాణకు చిన్ననీటివనరుల కింద కేవలం 89.15 టీఎంసీలు మాత్రమే కేటాయింపులు ఉన్నాయని... కానీ, 175.54 టీఎంసీల నీటిని తీసుకున్నారని ఏపీ బోర్డుకు ఫిర్యాదు చేసింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నుంచి చిన్ననీటివనరుల కోసం కృష్ణా జలాలను తరలించకుండా చూడాలని కేఆర్ఎంబీని కోరింది. ఏపీ ఫిర్యాదుపై అభిప్రాయం చెప్పాలని కోరుతూ తెలంగాణ ఈఎన్సీకి బోర్డు సభ్యకార్యదర్శి హరికేష్ మీనా లేఖ రాశారు.
ఇదీ చూడండి: krishna board : 'తెలంగాణ తీరుతో ఏపీకి తీరని నష్టం'