రాయలసీమ ఎత్తిపోతల పనుల పరిశీలన, శ్రీశైలం వద్ద తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి అంశాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖకు బోర్డు లేఖలు రాసింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పనులు పరిశీలిస్తామని నోడల్ అధికారిని నియమించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరినా అది సాధ్యపడలేదు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఈ అంశాన్ని కృష్ణాబోర్డు కేంద్ర జలాశక్తిశాఖకు నివేదించినట్లు సమాచారం. శనివారం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించాలని బోర్డు కమిటీ పరిశీలిస్తోంది. ఒకవేళ ఏపీ సహకరించకపోతే సున్నితమైన అంశమైనందున తమకు సీఐఎస్ఎఫ్ భద్రత ఇవ్వాలని కేంద్ర హోంశాఖకు కూడా బోర్డు లేఖ రాసినట్లు సమాచారం.
శ్రీశైలం వద్ద తెలంగాణ ప్రభుత్వం జలవిద్యుత్ ఉత్పత్తి కొనసాగించడం, సంపూర్ణ సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి చేయాలని జారీ చేసిన ఉత్తర్వుల అంశాన్ని కూడా కృష్ణాబోర్డు కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. జలవిద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు బోర్డుకు ఫిర్యాదు చేసింది. శ్రీశైలంలో నీటిమట్టం చాలా తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ జలవిద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తోందని, తక్షణమే ఆపాలని కోరింది. 28వ తేదీన 16877 క్యూసెక్కుల నీటిని ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా విడుదల చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. వంద శాతం జలవిద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, అదే జరిగితే రోజుకు నాలుగు టీఎంసీలు దిగువకు వెళ్తాయని తెలిపారు. దాంతో శ్రీశైలంలో 854 అడుగుల మేర నీటిమట్టం ఉండదని, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 7000 క్యూసెక్కుల నీరు తీసుకోవడం సాధ్యం కాదని లేఖలో పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ అవసరాల కోసం సాగర్లో సరిపడా నీరు ఉన్నందున శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ బోర్డును కోరింది. లేఖ ప్రతిని కేంద్ర జలశక్తి శాఖకు కూడా పంపినట్లు సమాచారం.
ట్రైబ్యునల్ సమావేశాలు వాయిదా
కృష్ణా జల వివాద ట్రైబ్యునల్ సమావేశం మళ్లీ వాయిదా పడింది. తెలంగాణ, ఏపీల మధ్య జల వివాదంపై బ్రిజేష్కుమార్ ఛైర్మన్గా గల కృష్ణా ట్రైబ్యునల్ విచారణ జరుపుతోంది. గత ఏడాదిన్నరగా సమావేశాలు జరగలేదు. జులై 7 నుంచి 9వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని గత నెలలో నిర్ణయించారు. తెలంగాణ తరఫు సాక్షిని ఆంధ్రప్రదేశ్ న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంది. తమ సీనియర్ న్యాయవాది అందుబాటులో లేరని, సమావేశాన్ని రెండు వారాల పాటు వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. తెలంగాణ మాత్రం సమావేశం నిర్వహించినా తమకేమీ అభ్యంతరం లేదని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని సమావేశాన్ని ట్రైబ్యునల్ వాయిదా వేసింది. జులై 28 నుంచి 30 వరకు నిర్వహిస్తామని సమాచారమిచ్చింది.
ఇదీ చదవండి: Land rates: రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలి