Krishna Board Suggestions to Telegu States: కృష్ణా ట్రైబ్యునల్-2 అమలులోకి వచ్చే వరకు రాజోలిబండ కుడికాలువ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ చేపట్టవద్దని, తుమ్మిళ్ల ఎత్తిపోతల నిర్వహణను తెలంగాణ నిలిపివేయాలని కృష్ణానదీ యాజమాన్యబోర్డు రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది. రాజోలిబండ నీటి మళ్లింపు పథకం(ఆర్డీఎస్) కింద 87,500 ఎకరాల ఆయకట్టుకు 15.9 టీఎంసీల నీటి కేటాయింపు ఉన్నప్పటికీ నీరు రావడం లేదన్న తెలంగాణ ఫిర్యాదు మేరకు కృష్ణాబోర్డు అధికారులు గత నెల 28న తెలుగు రాష్ట్రాల ఇంజినీర్లతో కలిసి ఆర్డీఎస్ ఆనకట్ట, సుంకేశుల ప్రాజెక్టులను పరిశీలించారు. తగిన చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లకు నివేదిక పంపారు.
తుంగభద్ర ప్రాజెక్టుకు 120 కిలోమీటర్ల దిగువన ఆర్డీఎస్ ఆనకట్ట ఉంది. ఎడమవైపు కర్ణాటక, కుడివైపు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఆర్డీఎస్ ఆనకట్ట హెడ్‌వర్క్స్ నిర్వహణ కర్ణాటక చేతిలో ఉంది. 1958లో నిర్మించిన ఈ ఆనకట్టకు ఎడమవైపు మూడు తూములుండగా, కుడివైపు ఉన్న అయిదింట్లో నాలుగు మూసివేశారు. ఎడమవైపు గేట్ల నిర్వహణతో సహా అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి. తెలంగాణకు నీటిని సరఫరా చేసే ఆర్డీఎస్ హెడ్‌రెగ్యులేటర్ ఎడమవైపు ఉంది. దీనికి అయిదు తూములున్నాయి. హెడ్‌రెగ్యులేటర్ బాగానే ఉన్నా, గేట్లు సరిగా లేవు. ఆర్డీఎస్ ప్రధాన కాలువ 143 కి.మీ కాగా, ఇందులో 42.60 కి.మీ కర్ణాటకలో, మిగిలింది తెలంగాణలో ఉంది. రెండు రాష్ట్రాలకు సంయుక్తంగా ఉండే కాలువ నిర్వహణ బాధ్యత కర్ణాటకది. కాలువ సామర్థ్యం 850 క్యూసెక్కులు కాగా తెలంగాణ సరిహద్దులో 771 క్యూసెక్కులు రావాల్సి ఉంది. కమిటీ పరిశీలించిన రోజు ఎగువన 638 క్యూసెక్కులు విడుదల చేయగా, తెలంగాణ సరిహద్దులో 419 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. ఎగువన కర్ణాటకలో కాలువ లైనింగ్ చేసి మంచి స్థితిలో ఉండగా, తెలంగాణలో లైనింగ్ దెబ్బతినడంతో పాటు గడ్డి మొలిచింది. సుంకేశుల నుంచి తీసుకొని ఆర్డీఎస్ కాలువ 75.60 కి.మీ దగ్గర నీటిని కలిపేలా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతలకు రెండు పంపులుండగా, తాము వెళ్లిన సమయంలో ఒక పంపు పని చేస్తుంది. 300 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు. మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు నీటిని మళ్లించే మూడో పంపును ప్రారంభించాల్సి ఉంది.
ఆంధ్రకు విడుదల చేసిన నీటిలోనే..
సుంకేశుల బ్యారేజీ నుంచి కేసీ కాలువ(ఏపీ)కు నీటిని తీసుకొంటారు. తాము పర్యటించన రోజు ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి మేరకు తుంగభద్ర బోర్డు నుంచి రెండువేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నీటి విడుదల కోరకపోయినా ఇందులోంచి కర్ణాటక 219, తెలంగాణ తుమ్మిళ్లకు 300 క్యూసెక్కుల నీటిని తీసుకొంటున్నాయి. ఆర్డీఎస్‌కు 75 శాతం నీటి లభ్యత కింద 17.1 టీఎంసీల కేటాయింపు ఉండగా, తెలంగాణ వాటా 15.9, కర్ణాటకది 1.2 టీఎంసీలు. కేసీకాలువ(ఏపీ)కు కేటాయింపు 31.9 టీఎంసీలు. నది నుంచి కాకుండా తుంగభద్రడ్యాం నుంచి ఆర్డీఎస్‌కు ఏడు టీఎంసీలు ఉండగా, ఇందులో తెలంగాణకు 6.51 టీఎంసీలు, కర్ణాటక వాటా 0.49 టీఎంసీలు. డ్యాం నుంచి కేసీకాలువకు పది టీఎంసీలు వెళ్లాలి. మిగిలిన నీటిని తుంగభద్ర ఓవర్‌ప్లో అయినప్పుడు తీసుకొంటారు. రివర్‌బెడ్‌లో పూడిక, తెలంగాణ ప్రాంతంలో ఆర్డీఎస్ ప్రధాన కాలువ నిర్వహణ సరిగాలేక పోవడం ప్రధాన సమస్యలుగా ఉన్నాయని బోర్డు నివేదిక పేర్కొంది. ఆర్డీఎస్‌కు ఏడు టీఎంసీలు, సుంకేశులకు పది టీఎంసీలు సక్రమంగా రావాలంటే ఆర్డీఎస్ ఆనకట్ట నిర్వహణ మెరుగ్గా ఉండాలని, దీంతోపాటు మూడు రాష్ట్రాలు ఒకేసారి నీటికోసం ఇండెంట్ ఇవ్వాలని సూచించింది. ఆర్డీఎస్ ఆనకట్ట, హెడ్‌రెగ్యులేటర్‌పై సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చిస్టేషన్‌తో అధ్యయనం చేయించి ఆధునికీకరణ పనులు చేపట్టాలంది. మూడు రాష్ట్రాలు తమ కేటాయింపులకు తగ్గట్లుగా ఖర్చు భరించాలని సూచించింది. కృష్ణా ట్రైబ్యునల్-2 తీర్పు అమలులోకి వచ్చే వరకు తుమ్మిళ్ల నుంచి నీటిని తీసుకోవడం, మల్లమ్మకుంట ప్రారంభం, ఆర్డీఎస్ కుడి ప్రధాన కాలువల నిర్మాణాన్ని చేపట్టరాదని కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను బోర్డు కోరింది.
ఇదీ చూడండి: Rowdy Sheeter: సోదరుడు చనిపోయాడని.. కత్తి పట్టుకుని బయల్దేరిన రౌడీషీటర్