Krishna Board Committee Meet : జలవిద్యుత్ ఉత్పత్తి కోసం మార్గదర్శకాల రూపకల్పన, వరదనీటి లెక్కలు, రూల్ కర్వ్స్ అంశాలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ మరోమారు సమావేశం కానుంది. ఇటీవలి కేఆర్ఎంబీ సమావేశ నిర్ణయానికి అనుగుణంగా బోర్డు ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కేఆర్ఎంబీ సభ్యుడు రవి కుమార్ పిళ్లై, కన్వీనర్‌గా ఉన్న కమిటీలో బోర్డు సభ్యుడు మౌంతాంగ్, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి, రెండు రాష్ట్రాల జెన్కో అధికారులు వెంకటరాజం, సృజయ కుమార్ ఉన్నారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి కోసం 15 రోజుల్లోగా రూల్ కర్వ్స్ ముసాయిదాపై పరిశీలన, వరదజలాల లెక్కింపు అంశాలపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని బోర్డు పేర్కొంది. అందుకు అనుగుణంగా కమిటీ తొలి సమావేశం ఈ నెల 20వ తేదీన నిర్వహించింది. అయితే ఆ సమావేశానికి తెలంగాణ అధికారులెవ్వరూ హాజరు కాలేదు. తాము ప్రీ మాన్సూన్ తనిఖీల్లో ఉన్నందున సమావేశానికి హాజరు కాలేమని.. జూన్ 15వ తేదీ తర్వాత సమావేశం నిర్వహించాలని అప్పట్లో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కోరారు.
తాజాగా కమిటీ రెండో సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జలసౌధలో సోమవారం ఉదయం సమావేశం జరగనుంది. అయితే జూన్ 15 తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని గతంలోనే కోరిన నేపథ్యంలో తెలంగాణ అధికారులు ఇవాళ కూడా హాజరవుతారా లేదా అన్నది చూడాలి. నేటి సమావేశానికి తెలంగాణ అధికారుల హాజరుపై అనుమానం వ్యక్తమవుతోంది.
ఇవీ చదవండి: డ్రైవర్ పోస్టులకు పట్టభద్రులు... కానిస్టేబుల్ ఉద్యోగానికి పోస్టుగ్రాడ్యుయేట్లు
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. బరిలో చిదంబరం, సూర్జేవాలా