Kishan Reddy Will Visit Warangal On Sunday : వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆదివారం వరంగల్ వెళ్తున్నట్లు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బీజేపీ కార్యాలయాల్లో భోజన వసతి, ఉండేందుకు సౌకర్యం కల్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. విపత్తు నిర్వహణ కింద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూ.988 కోట్లు సిద్ధంగా ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇందులో 75 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులేనన్నారు.
వాటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయవచ్చునని చెప్పారు. ఈ నిధుల నుంచే మరణించిన వారికి రూ.4 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందులో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.193 కోట్లు కేంద్రం విడుదల చేయాల్సి ఉందని మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో అన్నారు.
Minister Kishan Reddy Comments On KCR : ప్రభుత్వం అసెంబ్లీ నడిపిస్తే కదా ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గురించి ఆలోచించేదని కిషన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుని అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి అర్థం లేకుండా చేశారని మండిపడ్డారు. రెండు పడక గదుల ఇళ్లను పరిశీలించేందుకు తాను వెళ్తానంటే అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఆందోళనకు బీజేపీ మద్దతు : ఈ రోజు గ్రేటర్ మున్సిపల్ కార్యాలయం ముందు కాంగ్రెస్ ఆందోళనలకు పూర్తిగా సహకరించామని కిషన్రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఎవరు ఎవరితో కలిశారో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటున్న మేధావులు చెప్పాలన్నారు. తాము ప్రతి కార్యక్రమానికి కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఫైల్స్ పైన సంతకాలు చేసేందుకు రేపు ఉదయం దిల్లీకి వెళ్తున్నట్లు చెప్పారు. ఆదివారం వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు ఈ నెల 31న మహబూబ్నగర్లో పర్యటించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.
Bandi Sanjay Statement On Telangana Floods : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తెలంగాణలో అపార ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే 20 మంది చనిపోయారని.. మరో 25 మంది గల్లంతయ్యారని తెలిపారు. వేలాది పశువులు చనిపోయాయని, చాలా మంది ఆచూకీ లభించలేదన్నారు. ఇండ్లు మునిగిపోయాయని.. లక్షల ఎకరాల్లో పంటల నష్టం జరిగిందని బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
వేగంగా మేల్కొని రాష్ట్ర ప్రభుత్వం : వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ రాష్ట్రప్రభుత్వం తప్పేనని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితులను చూస్తుంటే దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లు ఉంది తెలంగాణ ప్రభుత్వం తీరని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి :