ఉప్పుడు బియ్యం(Boiled Rice) సమస్య మిల్లర్లు, రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ముడి బియ్యాన్ని కేంద్రం ఎంతైనా కొంటుందన్న కిషన్ రెడ్డి.. రైతుల పక్షాన నిలబడతామని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఏ రైతు కూడా బాయిల్డ్(paddy procurement issue in telangana) రైస్ ఉత్పత్తి చేయరని.. ఈ సమస్య రైతులది కాదని మిల్లర్లదని స్పష్టం చేశారు. మూడేళ్లుగా దశల వారీగా బాయిల్డ్ రైస్ తగ్గించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో జరిగిన ధర్నాలపై స్పందించిన కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు.
రాష్ట్రంలో ఏ రైతు అయినా ఉప్పుడు బియ్యం(Boiled Rice) ఉత్పత్తి చేస్తున్నారా.? బాయిల్డ్ రైస్‌ను అనేక రాష్ట్రాల్లో ఎవరూ తినడం లేదు. ఇది రైతుల సమస్య కాదు రైస్ మిల్లర్లది. బియ్యాన్ని రైతులు ఉత్పత్తి చేయరు. వాళ్లు ధాన్యాన్ని మాత్రమే ఇస్తారు. అదే ఇవ్వమని చెబుతున్నాం. దశల వారీగా బాయిల్డ్ రైస్ తగ్గించాలని కేంద్రం కోరుతూ వచ్చింది. వరి ధాన్యం కొనేది లేదని కేంద్రం ఎక్కడైనా చెప్పిందా.? రైతుల సమస్య కల్వకుంట్ల కుటుంబానిది కాదు. ఇతర రాష్ట్రాల్లో ఒక సీజన్లో గోధుమలు, మరో సీజన్లో వరి వేస్తారు. అందుకే వాటిని కొనుగోలు చేస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న అగ్రిమెంట్‌నే కేంద్రం పాటిస్తుంది. -కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి
అప్పుడెందుకు మాట్లాడలేదు..
దిల్లీకి వచ్చిన సీఎం కేసీఆర్(CM kcr) ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో ఎందుకు మాట్లాడటంలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union minister Kishan Reddy) ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం మేరకే కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు(paddy procurement issue in telangana) చేస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ధర్నా చౌక్లు అవసరం లేదన్న వాళ్లే ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత దళితబంధు పథకం అమలు చేస్తామన్న సీఎం మాటలు ఎటుపోయాయని ప్రశ్నించారు. సైనికులపై ముఖ్యమంత్రి మాటలు బాధాకరమని పేర్కొన్నారు. యునెస్కోలో ఉన్న అన్ని దేశాధినేతలతో మాట్లాడి రామప్ప దేవాలయానికి ఓటు వేయించిన కేసీఆర్‌కు అభినందనలు అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సవాళ్లతో సమస్యలకు పరిష్కారం చూపించలేరని రాష్ట్ర మంత్రులు గుర్తించుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేసే బదులు ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టాలని కిషన్ రెడ్డి హితవు పలికారు. ఆయుష్మాన్ భారత్, దళితులకు మూడెకరాల భూమి మీద దృష్టి సారించాలని సూచించారు.
ఆ ఆస్పత్రి తెలంగాణలోనే ఉంది కదా..
కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోందన్న కిషన్ రెడ్డి(Union minister Kishan Reddy).. కొత్త మెడికల్ కళాశాల దరఖాస్తు కోసం కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు కోరిందని చెప్పారు. బీబీ నగర్ ఎయిమ్స్ ఆస్పత్రి తెలంగాణలో లేదా అని ప్రశ్నించారు. బీబీ నగర్ ఎయిమ్స్‌లో ఆస్పత్రి, మెడికల్ కాలేజీ, ఓపీ ప్రారంభం అయ్యాయని కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టింపులకు పోకుండా.. ఎయిమ్స్ ఆస్పత్రికి భవనాలను అప్పగించే ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
సరైన గుర్తింపు లేదు
అల్లూరి సీతారామరాజు, కుమురం భీం కుటుంబాలకు సరైన గుర్తింపు దక్కలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union minister Kishan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. బిర్సాముండా జయంతిని గిరిజన దినోత్సవంగా జరపాలని డిమాండ్ చేశారు. ఈసారి సమ్మక్క, సారలమ్మ జాతరకు కేంద్రం నిధులు ఇస్తుందని(Union minister Kishan Reddy) తెలిపారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
నవంబరు 15న జాతీయ గిరిజన దినోత్సవం నిర్వహిస్తాం. ఈ నెల 15 నుంచి 22 వరకు గిరిజన దినోత్సవం జరుపుతాం. రాష్ట్రంలో ట్రైబల్ మ్యూజియానికి రూ. 15 కోట్లు ఇస్తున్నాం. ఇప్పటికే రూ. కోటి విడుదల చేశాం. ట్రైబల్ మ్యూజియాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేయాలి. -కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి
ఇదీ చదవండి: KTR: ఆ అధికారులు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా?: మంత్రి కేటీఆర్