Kishan Reddy on Telangana Liberation Day 2023 : సమైక్యతా దినోత్సవం కాదు.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో విమోచన ఉత్సవాలు నిర్వహించాలని పేర్కొన్నారు. విమోచన ఉత్సవాలు నిర్వహించాల్సిందిగా.. రాష్ట్రంలోని సర్పంచ్‌లందరికీ లేఖలు రాస్తున్నట్లు చెప్పారు.
Kishan Reddy on Telangana Liberation Day 2023 : 'తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాల్సిందే'
Telangana Liberation Day 2023 : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సెప్టెంబర్ 17న విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని.. ఈ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను విమోచన ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే ఓవైసీ అనుమతి ఉంటేనే.. సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17న కార్యక్రమానికి హాజరవుతారని విమర్శించారు.
"కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ మైదానంలో సెప్టెంబర్ 17న విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నాం. ఓవైసీ అనుమతి ఉంటేనే సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17 కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్రపతి నిలయంలో కూడా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. మజ్లిస్ పార్టీకి లొంగిపోయి ఇచ్చిన వాగ్దానాన్ని కేసీఆర్ విస్మరించారు. సమైక్యతా దినోత్సవం కాదు.. విమోచన దినోత్సవాన్ని తెలంగాణ సర్కార్ అధికారికంగా నిర్వహించాలి." - జి.కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
మూర్ఖత్వంతో తమకు గ్రౌండ్ ఇవ్వలేదని కొందరు ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. విమోచన ఉత్సవాలు బీజేపీ కార్యక్రమం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రపతి నిలయంలోనూ తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీకి లొంగిపోయి.. ఇచ్చిన వాగ్దానాన్ని కేసీఆర్ విస్మరించారని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీ ఎంఐఎంకు తొత్తుగా వ్యవహరిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విమోచన దినోత్సవంపై ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించిన మోసకారి కేసీఆర్ అని మండిపడ్డారు. తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందన్న ఆయన.. విమోచన దినోత్సవంలో మెదటి ద్రోహి కాంగ్రెస్.. రెండో ద్రోహి బీఆర్‌ఎస్ అని ఆరోపించారు. తెలంగాణ చరిత్రను తొక్కిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని ఆక్షేపించారు.
"గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీ ఎంఐఎంకు తొత్తుగా వ్యవహరిస్తోంది. విమోచన దినోత్సవంపై ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించిన మోసకారి కేసీఆర్. తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. విమోచన దినోత్సవంలో మెదటి ద్రోహి కాంగ్రెస్.. రెండో ద్రోహి బీఆర్‌ఎస్. తెలంగాణ చరిత్రను తొక్కిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
'ఆయన వల్లే హైదరాబాద్ భారత్‌లో విలీనం.. లేదంటే పాకిస్థాన్లో కలిపేవారు'