Kishan Reddy on PM Modi Telangana Tour Deatils : ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడల్లా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జ్వరం వస్తుందని కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఎద్దేవా చేశారు. తెలంగాణకు కేంద్రం ఏమీ చేసింది.. బీఆర్ఎస్ సర్కారు ఏమీ చేసిందో చెప్పడానికి.. కేసీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. సీఎంకు దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్ద చర్చకు రావాలని డిమాండ్ చేశారు. తన పనితీరుకు కేటీఆర్ సర్టిఫికెట్ అక్కరలేదని.. తెలంగాణ ప్రజలు ఇచ్చారని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
PM Modi Telangana Tour : ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కేసీఆర్‌కు లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని వస్తే అన్ని రాష్ట్రాల సీఎంలు స్వాగతం పలికేందుకు వస్తారని.. సీపీఎం ముఖ్యమంత్రి కూడా స్వాగతం పలుకుతారని గుర్తు చేశారు. కేసీఆర్ మాత్రం ప్రధాని తెలంగాణకు వస్తే స్వాగతం పలికేందుకు రారని మండిపడ్డారు. బీజేపీ ఇరకాటంలో పెట్టే కుట్ర కేసీఆర్ కుటుంబం చేస్తోందని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ రాబోతున్నారని.. కిషన్‌రెడ్డి తెలిపారు. 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు మోదీ.. శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని పేర్కొన్నారు. పాలమూరు కేంద్రంగా రూ.13,545 కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని జాతికి అంకితం చేస్తారని కిషన్‌రెడ్డి వివరించారు.
ఇందులో భాగంగా రూ.6,404 కోట్లతో చేపట్టే కొత్త జాతీయ రహదారుల ప్రాజెక్టులను (National Highway Projects).. ప్రధాని మోదీ ప్రారంభిస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్‌లో హెచ్‌పీసీఎల్ గ్యాస్ పైపులైన్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నట్లు వివరించారు. రూ.2661 కోట్లతో హసన్-చర్లపల్లి హెచ్‌పీసీఎల్ గ్యాస్ పైపులైన్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ నిర్మాణం ద్వారా 35 లక్షల మందికి లబ్ధి కలుగుతుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
జక్లేర్-కృష్ణ మధ్య కొత్త రైల్వే లైనును ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. తద్వారా హైదరాబాద్-గోవా మధ్య 120 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుందని చెప్పారు. గోవా వెళ్లే హైదరాబాద్ పర్యాటకులకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. కాచిగూడ-రాయచూర్ రైలు సర్వీసును ప్రధాని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కృష్ణపట్నం నుంచి తెలంగాణకు మల్టీ ప్రొడక్ట్ పైపులైన్ నిర్మాణంను చేపట్టనున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు.
Kishan Reddy Comments on CWC Meeting : 'తప్పుడు సర్క్యులర్ ఇవ్వడంపై క్షమాపణ చెప్పాలి'
తొలి విడత రూ.1932 కోట్లతో మల్టీ ప్రొడక్ట్ పైపులైన్ (Multi Product Pipeline)నిర్మాణం జరగనుందని.. తెలంగాణ అవసరాల కోసం కేంద్రం ఈ పైపులైను నిర్మిస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. దీనిద్వారా డీజిల్, పెట్రోల్, కిరోసిన్, జెట్ ఇంధనం పైపులైన్ సరఫరా చేయనున్నట్లు చెప్పారు. హెచ్‌సీయూలో (HCU) ఆరు నూతన భవనాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని వివరించారు. హీరా అనే విధానంతో రాష్ట్రంలో రూ.1.2 లక్షల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. కొత్త జిల్లాల్లోనూ యుద్ధప్రాతిపదికన జాతీయ రహదారులను అనుసంధానం చేస్తున్నట్లు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
66 సంవత్సరాల్లో కంటే.. 9 ఏళ్లలోనే తెలంగాణలో రహదారుల నిర్మాణం ఎక్కువగా జరిగిందని కిషన్పరెడ్డి తెలిపారు. రైల్వే బడ్జెట్‌ను మోదీ ఘనంగా పెంచారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బడ్జెట్ కేటాయించేది తప్పితే.. ప్రాజెక్టులు పూర్తి చేసేది కాదని విమర్శించారు. రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ మెరుగైందని చెప్పారు. దేశంలో 75 విమానాశ్రయాలు ఉంటే మోదీ ప్రధాని అయ్యాక 153 ఎయిర్‌పోర్టులకు పెంచారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు.
నిజామాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ రూ.8021 కోట్ల అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. రామగుండంలో నిర్మించిన 800 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. అల్ట్రా సుపర్ క్రిటికల్ సాంకేతికతను ఈ ప్రాజెక్టులో ఉపయోగించడం జరిగిందని.. ఇందులో బొగ్గు వినియోగం తక్కువ.. విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని వివరించారు. రూ.1360 కోట్లతో 496 బస్తీ దవాఖానాలను, 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌లను ప్రతి జిల్లాలో నిర్మించే పనులను మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు.
రూ.305 కోట్లతో నిర్మితమైన రైల్వే విద్యుత్ లైన్‌ను ప్రజలకు ప్రధాని మోదీ అంకితం చేస్తారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కొమురవెల్లి దేవస్థానం వద్ద రైల్వేస్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పాలమూరు ప్రజా గర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రధాని హాజరయ్యే బహిరంగ సభలను విజయవంతం చేయాలని కిషన్‌రెడ్డి పిలుపు నిచ్చారు.
"నా పనితీరు కేటీఆర్ సర్టిఫికెట్ అక్కరలేదు. తెలంగాణ ప్రజలు నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. బీఆర్ఎస్ సర్కారు ఏమీ చేసింది చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కేసీఆర్‌కు లేదు." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Kishan Reddy on PM Modi Telangana Tour : 'నిజామాబాద్ సభలోనే తెలంగాణలో మోదీ ఎన్నికల శంఖారావం'
Kishan Reddy Fires on KCR : 'ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారు'