Kishan Reddy on BJP MLA Candidates List 2023 : రాష్ట్రంలో ఎన్నికలు ఎపుడు వచ్చినా.. తెలంగాణ బీజేపీ సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలన్నది తమ ఇష్టమని.. నామినేషన్ చివరి వరకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం తమ ఎన్నికల స్ట్రాటజీలో భాగమని.. ఇప్పటికే 50 శాతం వరకు పూర్తి చేసినట్లు వివరించారు. సికింద్రాబాద్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Kishan Reddy on BJP MLA Tickets 2023 : ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఇప్పటికే రెండు సార్లు తెలంగాణకు వచ్చారని.. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులూ త్వరలో మరింత మంది ఇక్కడికి ప్రచారానికి రాబోతున్నారని కిషన్‌రెడ్డి వివరించారు. ఇప్పటికే అనేకమంది బీజేపీ చేరుతున్నట్లు చెప్పారు. ప్రజలు కమలం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.
Kishan Reddy on Telangana Assembly Elections : ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు రైలు ప్రారంభం సందర్బంగా.. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు.. రైల్వే సిబ్బందిని దూషించారని, ఫ్లెక్సీలు చించివేశారని, టీవీలు పగలగొట్టారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. వారు రైల్వే అధికారులను అవమానించేలా చర్యలకు పాల్పడ్డారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణాలో రైల్వేల కోసం రూ.33,000 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు. కేంద్రం రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధి చేస్తుంటే.. రాష్ట్ర సర్కార్ మాత్రం దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రజలే కేసీఆర్ (KCR) ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఎన్నికలు ఎపుడు వచ్చిన తెలంగాణ బీజేపీ సిద్ధంగా ఉంది. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలన్నది మా ఇష్టం. నామినేషన్ చివరి వరకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం మా ఎన్నికల స్ట్రాటజీలో భాగం. - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
అంతకుముందు కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో.. దక్షిణ మధ్య రైల్వే నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో నాలుగు రైలు సర్వీసుల పొడిగింపును (Four Train Services Extended) జెండా ఊపి ప్రారంభించారు. తద్వారా ప్రయాణికులకు కొత్త రైల్వే సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు కొత్త రైల్వే టెర్మినల్ వస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. జనవరిలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో ఫేజ్‌లో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఎంఎంటీఎస్ రెండో ఫేజ్‌లో కొత్త మార్గాలను వేగంగా పూర్తి చేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగిస్తామని చెప్పారు. రెండో విడత కోసం రైల్వే బోర్డు నిధులు మంజూరు చేసినట్లు.. తెలంగాణ సర్కార్ సహకారం ఉంటే త్వరగా పనులు పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్‌కు భూమిపూజ చేసుకున్నామని..ఆర్‌ఎంయూ నిర్మాణ పనులు వేగంగా ప్రారంభమవుతాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఉపసభాపతి పద్మారావు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Kishan Reddy Fires on KCR : 'ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారు'
ఈ నాలుగు రైలు సర్వీసులను హడప్సర్- హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్.. కాజీపేట వరకు, జైపూర్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్.. కర్నూలు సిటీ వరకు, నాందేడ్- తాండూరు ఎక్స్‌ప్రెస్.. రాయచూర్ వరకు, కరీంనగర్- నిజామాబాద్ ఎక్స్‌ప్రెస్‌లను.. బోధన్ వరకు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ తెలిపింది. పొడిగించిన అన్ని సర్వీసులకు బుకింగ్‌లు మొదలుపెట్టినట్లు పేర్కొంది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.