Kishan Reddy focus on Parliament Elections in Telangana : తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముందని, సర్వే సంస్థలకు అందని విధంగా లోక్‌సభ ఫలితాలుంటాయని బీజేపీ(bjp) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్తో సమాన పోరాటం ఉంటుందని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంచార్జిలు, పార్లమెంటరీ ఇంచార్జీలతో కిషన్‌రెడ్డి(kishan reddy) సమావేశం అయ్యారు. అత్యధిక లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్వలాభం లేకుండా ఏ నిర్ణయం తీసుకోదు : కిషన్‌రెడ్డి
పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ శ్రేణులందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన ఆయన ఎవరితోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని నాయకులకు పిలుపునిచ్చారు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారని స్పష్టం చేశారు. డిసెంబర్ చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నట్లు తెలిపారు.
"రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి. లోకసభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవు. తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముంది. సర్వే సంస్థలకు అందని విధంగా లోక్‌సభ ఫలితాలుంటాయి". - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Telangana BJP Master Plan on MP Elections : రాష్ట్రంలో వికసిత భారత్ పేరుతో శనివారం నుంచి కేంద్రం ఆధ్వర్యంలో సంకల్ప యాత్రలు చేపట్టనుంది. అన్ని జిల్లాల్లో చేపట్టనున్న సంకల్ప యాత్రలు మొత్తం 163 వాహనాలు 40 రోజుల పాటు నిర్వహించనున్నారు. రోజుకు 2 సెంటర్లలో కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. 13 వేల కేంద్రాల్లో కార్యక్రమాలు చేపట్టనుంది. శనివారం నుంచి జనవరి 26 వరకు కార్యక్రమం నిర్వహించనుంది.
పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ గురి - టికెట్ల కోసం నాయకుల మధ్య హోరాహోరీ పోటీ
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడం, కేంద్ర పథకాలకు కొత్త లబ్ధిదారులను ఎన్రోల్ చేయించడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగనుంది. వికసిత భారత్ సంకల్ప యాత్రల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు. ఈ వికసిత భారత్ పేరుతో నిర్వహించే యాత్రలను విజయవంతం చేసేందుకు కాషాయ శ్రేణులు సైతం సిద్ధమయ్యాయి.
Etela on Parliament Elections : రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో బీజేపీకి పెద్దఎత్తున కార్యకర్తలు తయారయ్యారన్నారు. రేపు జరగబోయే ఎన్నికలు మోదీకి సంబంధించినవని వీటిలో బీజేపీ విజయకేతనం ఎగరేయడం ఖాయమన్నారు.
రాహుల్ గాంధీకి దమ్ముంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని నిరూపించాలి : కిషన్ రెడ్డి