Kids Library in Sanath Nagar Police Station: పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతారు. కాస్త పెద్దయ్యాక బడికెళతారు. తీరిక దొరికినప్పుడల్లా ఆడుకుంటారు. చిన్నప్పుడే సేవ చేయాలి. ఇతరులకు ఉపయోగపడే పనులు చేయాలి లాంటి ఆలోచనలు ఎవరికీ రావు. కానీ హైదరాబాద్‌లోని సనత్ నగర్‌కు చెందిన ఆకర్షణ సతీష్ అనే బాలికకు వచ్చాయి. వాటిని ఆమె ఆచరణలో పెట్టి సఫలం అయింది.
బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న ఆకర్షణ.. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంది. దీనికోసం అనుమతి ఇవ్వాలంటూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు ఒక లేఖ రాసింది. దానికి ఆయన స్పందించారు. ఆమె కోరిన విధంగా చేయడానికి అనుమతిని ఇవ్వడంతో పాటు ఈ మంచి ఆలోచనకు అభినందించారు. లైబ్రరీలో తాను సేకరించిన నాలుగు వేల పుస్తకాలను ఉంచింది. బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ రావు, ఏసీపీ గంగారావు ఆధ్వర్యంలో ఆమె చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు.
లైబ్రరీ ఏర్పాటుకు బీజం ఇలా..: ఆకర్షణ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారులతో మాట్లాడేది. వారిని ఓదార్చి ధైర్యం చెప్పేది. వారితో మాట్లాడుతున్న సందర్భంలో కలర్స్ స్టోరీ బుక్స్ ఉంటే బోర్ కొట్టకుండా ఉంటుందని ఆ పిల్లలు చెప్పారు. దీంతో లక్డీకాపూల్ లోని ఎంజీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ చిన్నారుల కోసం గతంలో లైబ్రరీని ఏర్పాటు చేసింది.
ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆకర్షణ.. ప్రధాని మోదీ, మంత్రి కేటీఆర్‌లతోపాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంది. హైదరాబాద్ లో వరదల సమయంలో ఆమె తాను దాచుకున్న రూ. 2 వేలను సీఎం సహాయ నిధికి అందించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నుంచి మన్ననలు అందుకుంది. ఆమెను గవర్నర్.. తన కుటుంబ సభ్యులతో రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు. అసోం వరదల సమయంలోనూ స్వచ్ఛందంగా విరాళాలు పంపిణీ చేసింది. గతేడాది పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకుండా.. ఆ డబ్బుతో 95 మాస్కులు, శానిటైజర్లు కొనుగోలు చేసి అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కి అందజేసింది.
పేరు పెట్టింది మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం: ఆకర్షణ పేరును పెట్టింది మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఒకసారి ఆయన ఆసుపత్రికి వచ్చినప్పుడు వాళ్ల తల్లిదండ్రులు ఆమెకు నిషా అనే పేరును పెట్టాల్సిందిగా కోరారు. అయితే కలాం ఆమెను చూసి చిన్నారి అందంగా ఉందని నిషా ఆకర్షణ అని నామకరణం చేశారు.
ఇవీ చదవండి: