గణేశ్ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని రక్షించేందుకు ఖైరతాబాద్ మహాగణపతి ధన్వంతరి రూపంలో తుది మెరుగులు దిద్దుకుంటున్నాడు. ప్రతిఏడు ఏర్పాటు చేసే ప్రదేశంలోనే 35 అడుగుల ఎత్తైన మండపంలో లంబోదరుడి విగ్రహానికి రంగులద్దే పనులు ప్రారంభమయ్యాయి. తొమ్మిది అడుగుల మట్టి వినాయక విగ్రహానికి శిల్పి నగేశ్ నేతృత్వంలో 20 మంది కళాకారులు రంగులద్దుతున్నారు.
శుక్రవారంలోగా సిద్ధం
శుక్రవారం లోగా పూర్తిస్థాయిలో వినాయకుని విగ్రహం సిద్ధం కానుందని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ సింగరి సుదర్శన్ తెలిపారు. విఘ్నేశ్వరునికి ఇరువైపుల లక్ష్మీ, సరస్వతి విగ్రహాలను మట్టితోనే తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. విగ్రహం తయారీలో ఇనుముతో పాటు బంకమట్టి 750కిలోలు, 50 కట్టల వరిగడ్డి, 50 కిలోల వరి పొట్టు, కొంత గంగానది మట్టి వినియోగించినట్లు చెప్పారు.
9 అడుగులు..1.5 టన్నుల బరువు
ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు తొమ్మిది అడుగుల పొడవుతో 1.5 టన్నుల బరువు ఉండనున్నట్లు సుదర్శన్ వెల్లడించారు. ఈనెల 22న వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతి ధన్వంతరి అవతారంలో భక్తులకు కనువిందు చేయనున్నాడు. 11 రోజులపాటు భక్తుల పూజలందుకుని సెప్టెంబర్ 1న గంగమ్మ ఒడికి చేరనున్నాడు.
ఆన్లైన్లో దర్శనం
కరోనా వ్యాపిస్తున్నందున ఆన్లైన్లో ఖైరతాబాద్ గణపతి దర్శనం అందుబాటులో ఉంటుందని కమిటీ ఛైర్మన్ సుదర్శన్ తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు వినాయకుడిని దర్శించుకోవచ్చని స్పష్టం చేశారు.
- ఇవీ చూడండి: 'కరోనా టీకా అత్యవసర ఆమోదాన్ని పరిశీలిస్తాం'