Key Development in Telangana BJP : శాసనసభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్న బీజేపీ దీనికి తగ్గట్లుగా రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాయకులంతా కలసికట్టుగా పని చేసేలా చూడటం.. ముఖ్యులకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా ఎన్నికలకు సిద్ధం కావడం, పార్టీ కార్యక్రమాలకు జోష్ పెంచడం దీని ప్రధానోద్దేశంగా తెలుస్తోంది. మరోవైపు ఈటల రాజేందర్ చేరికల కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌కు ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించడంతో పాటు.. మరికొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
Telangana BJP President : మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చినట్లు తెలిసింది. దీన్ని బీజేపీ వర్గాలు తోసిపుచ్చుతున్నా.. ఈ నెల 15న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వచ్చేలోగానే.. కొన్ని కీలక మార్పులు చేయవచ్చని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక స్థానం మాత్రమే గెల్చుకొన్న భారతీయ జనతా పార్టీ అత్యధిక నియోజకవర్గాల్లో నామమాత్రంగానే ఓట్లు సాధించింది. కానీ ఈ క్రమంలోనే వెంటనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా 4 స్థానాల్లో విజయం సాధించింది.
Telangana BJP Latest News : తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్‌లలో గెలవడం, మునుగోడులో గట్టి పోటీ ఇవ్వడం.. ఈ స్థానాల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం కావడం వంటి పలు కారణాలతో అధికార బీఆర్ఎస్‌కు.. బీజేపీనే ప్రత్యామ్నాయమనే అభిప్రాయం నెలకొంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2018లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. హుజూర్‌నగర్ శాసనసభ స్థానంలో గెలిచారు. తర్వాత ఎంపీగా గెలవడంతో అసెంబ్లీకి రాజీనామా చేశారు. ఇక్కడ వచ్చిన ఉప ఎన్నికలో హస్తం పార్టీ ఓడి భారత్ రాష్ట్ర సమితి గెలిచింది.
ఆ తర్వాత వచ్చిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఈ రెండు స్థానాలు ఆ పార్టీ ముఖ్య నేతలు ప్రాతినిథ్యం వహించినవే. ఇలా పలు కారణాలతో అధికార బీఆర్ఎస్‌కు.. భారతీయ జనతా పార్టీ గట్టి పోటీదారనే అభిప్రాయం నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్.. హిందుత్వ ప్రధాన ఎజెండాగా జనంలోకి వెళ్లారు. దీంతోపాటు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
కిషన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా అధ్యక్షునిగా నియమించడం, రాజ్యసభకు పంపడంతో పాటు.. పార్లమెంటరీ బోర్డు సభ్యునిగా బీజేపీ అధిష్ఠానం నియమించింది. ఇలా తెలంగాణకు అధిక ప్రాధాన్యమిస్తూ.. ప్రధాని మోదీ, అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పలుసార్లు రాష్ట్రంలో పర్యటించి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్‌కు.. బీజేపీనే ప్రత్యామ్నాయం : కేంద్రమంత్రులు కూడా తరచూ పర్యటిస్తున్నారు. కొందరు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు తీసుకుని పార్టీ కోసం పని చేస్తున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులందరూ.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపైన, బీజేపీపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీని గట్టిగా వ్యతిరేకిస్తున్నది కేసీఆరే అన్న అభిప్రాయం నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్, బూర నర్సయ్యగౌడ్.. కాంగ్రెస్ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇలా పలువురు కమలం పార్టీలో చేరారు. భారత రాష్ట్ర సమితిని దీటుగా ఎదుర్కొనేది బీజేపీనే అని ఆ నాయకులు భావించడమే దీనికి కారణం.
Bandi Sanjay vs Etela Rajender : బీజేపీలో ఈటల రాజేందర్‌కు చేరికల కమిటీ బాధ్యతలు అప్పగించినా.. కీలక పదవి ఏదీ లభించకపోవడం, పార్టీలో నాయకుల మధ్య సఖ్యత అంతగా లేకపోవడం.. తదితర అంశాలు నాయకుల అంతర్గత చర్చల్లో తరచూ వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ పరిస్థితిలో మరింత మార్పు వచ్చింది. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీనే పోటీదారనే అభిప్రాయం నెలకొనగా.. భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కూడా ఉత్సాహం కొంత తగ్గినట్లు ఆ పార్టీ వర్గాలే అనధికారికంగా పేర్కొంటున్నాయి.
రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఈటల: గతం కంటే భిన్నంగా సీఎం కేసీఆర్.. ఈ మధ్య కాంగ్రెస్‌పైనే ప్రధానంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై పార్టీ ఇన్‌ఛార్జి సునీల్‌బన్సల్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో ఈటల రాజేందర్ ఇప్పటికే చర్చించారు. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఈటల.. అందుకు విశ్వహిందూపరిషత్, ఆర్ఎస్‌ఎస్ లాంటి సంస్థల నుంచి అంత సానుకూలత ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఈటల రాజేందర్‌ను కీలకమైన పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా సంజయ్‌ను మార్చి.. కిషన్‌రెడ్డి లేదా మరొకరిని నియమిస్తారని, సంజయ్‌కు తగిన ప్రాధాన్యమిచ్చేందుకు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
ఇవీ చదవండి: