Kesha Rao Criticizes Narendra Modi Speech In Secunderabad: తెలంగాణలో జరిగిన అభివృద్ధి.. దేశంలో మరే రాష్ట్రంలో జరగలేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె.కేశవరావు తెలిపారు. ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ బీఆర్ఎస్పై చేసిన విమర్శలకు బదులిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కేఆర్ సురేశ్ రెడ్డి, వెంకటేశ్ పాల్గొన్నారు.
విభజన చట్టంలో చెప్పినట్లు.. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదాను ఇవ్వలేదని కేంద్రంపై కేశవరావు మండిపడ్డారు. శనివారం జరిగిన సికింద్రాబాద్లోని బహిరంగ సభలో ప్రధాని ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం కారణంగానే ఇక్కడ ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని ఆయనే చెప్పడం సరికాదని అన్నారు. కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడి ప్రాజెక్టుల విషయంలో ఓ కమిటిని వేసి.. పరిశీలించుకోవచ్చని సూచించారు.
కేంద్రం సహకారం లేకున్నా రాష్ట్రంలో అభివృద్ధి: కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ.. ముందుకు తీసుకువెళుతున్నామని కేకే చాటి చెప్పారు. అన్ని రంగాల్లోనూ దేశంలోని ఏ రాష్ట్రానికి సాధ్యం కాని ఘనతలను సాధించామని హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం, జీడీపీ, జీఎస్టీ వసూళ్లు, వ్యవసాయ రంగం, పరిశ్రమలు, ఐటీ ఎగుమతుల్లోనూ, పరిశ్రమలను తీసుకురావడంలోనూ ప్రథమ స్థానంలో నిలిచామని వెల్లడించారు.
వైద్య కళాళాల విషయంలో కేంద్రం సహకరించలేదని.. మెడికల్ కాలేజీలను ఒక్కటి కూడా మంజూరు చేయలేదని వివరించారు. అయినప్పటికీ ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాట్లు చేసుకొని.. ఇప్పటికే 18 మెడికల్ కళాశాలను మంజూరు చేసుకున్నామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క పైసా ఇవ్వకపోయినా.. దృఢ సంకల్పంతో పూర్తి చేసుకున్నామని సగర్వంగా చెప్పారు.
గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మన్మోహన్సింగ్ సభలకు వెళ్లలేదు: రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు మాత్రమే కేటాయించారు తప్ప.. ఒక్క రూపాయి కూడా ఎక్కువగా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాలను విస్మరిస్తే సమాఖ్య స్ఫూర్తి దెబ్బ తింటుందని చెప్పారు. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు.. గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ ఎన్నో కార్యక్రమాలకు వెళ్లలేదన్నారు. రైల్వేశాఖ ఆహ్వానంలో బీఆర్ఎస్ ఎంపీల పేర్లు లేవని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. సికింద్రాబాద్లో సభలో ప్రధాని అన్నీ అబద్ధాలే చెప్పారని కేశవరావు మండిపడ్డారు.
ఇవీ చదవండి: