BRS Manifesto 2023 Release Date : రాష్ట్రంలో ఎన్నికలు షెడ్యూల్ విడుదల అయినందున.. ప్రధాన రాజకీయ పార్టీలన్ని ఎన్నికల ప్రచారానికి సన్నద్ధం అవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ నెల 15న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమవ్వనున్నారు. అనంతరం ఆ పార్టీ మేనిఫెస్టో(BRS Manifesto)ను విడుదల చేయనున్నారు. అదే రోజు బీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వనున్నారు. నవంబర్ 9న కోనాయపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజల అనంతరం.. గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. అనంతరం కామారెడ్డిలోని బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
KCR Meeting With BRS MLA Candidates : ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో బీఆర్‌ఎస్ వేగం పెంచింది. ఇప్పటికే ఓ వైపు కేటీఆర్, హరీష్ రావు.. మరోవైపు అభ్యర్థులు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. ఈనెల 15 నుంచి గులాబీ దళపతి రంగంలోకి దిగనున్నారు. ఈనెల 15న తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వడంతో పాటు.. పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. నామినేషన్లు వేసే సమయంలో జాగ్రత్తలు.. ఎన్నికల నియామళి, ప్రచార వ్యూహాలను అభ్యర్థులకు కేసీఆర్ వివరించనున్నారు. అదే సమయంలో అభ్యర్థుల సమక్షంలో ఎన్నికల మేనిఫెస్టోను కేసీఆర్ విడుదల చేయనున్నారు. ఆసరా ఫించన్లు, రైతుబంధు సాయం పెంపు వంటి రైతు, మహిళ, బీసీ, మైనారిటీలు, యువతను ఆకర్షించేలా పలు హామిలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల పూర్తి వివరాలు ఇవే..
CM KCR Public Meeting in Telangana : ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో బీఆర్ఎస్ సభలను నిర్వహించనుంది. ఈ నెల 15 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. 15న హుస్నాబాద్‌లో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. 16న జనగామ, భువనగిరిలో కేసీఆర్ బహిరంగ సభలు(KCR Public Meetings) నిర్వహించనున్నారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో, 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్లలో.. సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ బహిరంగ సభల్లో గులాబీ దళపతి ప్రచారం నిర్వహిస్తారు.
కేసీఆర్ జిల్లాల పర్యాటన షెడ్యూల్ :
తేదీ | సభ జరిగే జిల్లా |
అక్టోబర్ 15 | హుస్నాబాద్ |
అక్టోబర్ 16 | జనగామ, భువనగిరి |
అక్టోబర్ 17 | సిద్దిపేట, సిరిసిల్ల |
అక్టోబర్ 18 | జడ్చర్ల, మేడ్చల్ |
Telangana Elections Schedule 2023 : రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల జరిగే తేదీలను ప్రకటించింది. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ మొదలయి.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు వరకు పూర్తి తేదీలను విడుదల చేసింది. దీంతో రాజకీయ పార్టీలన్ని ఎన్నికల ప్రచారం షెడ్యూల్ తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ఇచ్చింది. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను త్వరలోనే విడుదల చేయనుంది. బీజేపీ కూడా ఈనెల 15న తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉంది.