KCR ON ADANI ISSUE: తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. పార్లమెంట్‌లో మోదీ ప్రసంగంపై స్పందించారు. అదానీ అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంటే.. మోదీ ప్రసంగంలో అదానీ ప్రస్తావనే తీసుకురాలేదని మండిపడ్డారు. హిండెన్‌బర్గ్ లేవనెత్తిన అంశంపై ప్రధాని వివరణ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంపై ద ఎకానమిస్ట్ పత్రికలో కథనం వచ్చిందని పేర్కొన్న ఆయన.. అదానీ అంశంపై దిల్లీలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాయని తెలిపారు.
ఈ క్రమంలోనే 60, 40 ఏళ్ల కిందటి నెహ్రూ, ఇందిరాగాంధీల పాలనను విమర్శిస్తోన్న మోదీ.. అదానీ విషయం చెప్పకుండా సంబంధం లేని విషయాలు పార్లమెంట్‌లో ప్రసంగించారని కేసీఆర్ దుయ్యబట్టారు. దేశ ఆర్థిక దుస్థితిపై పార్లమెంటులో చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడిన ఆయన.. అసలు అభివృద్ధికి తలసరి ఆదాయం సూచనగా పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో భారత్ ర్యాంకు 139గా ఉందని పేర్కొన్న కేసీఆర్.. బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక కంటే మన తలసరి ఆదాయం తక్కువుందని విమర్శించారు. మోదీ చుట్టూ ఉన్న నేతలు అనవసరంగా ఆయన్ను పొగుడుతున్నారని.. అనవసర పొగడ్తలు ప్రధాని మోదీకి మంచి చేయవని హితవు పలికారు.
"అదానీ వ్యవహారంపై ద ఎకానమిస్ట్ పత్రికలో కథనం వచ్చింది. అదానీపై ప్రధాని నోటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హిండెన్‌బర్గ్ లేవనెత్తిన అంశంపై ప్రధాని వివరణ ఇవ్వాల్సిందే. అదానీపై రభస జరుగుతోందని ప్రధాని మాటల్లో ఆక్రోశం కనిపించింది. త్వం శుంఠ అంటే త్వం శుంఠ అని బీజేపీ, కాంగ్రెస్ నిందించుకుంటున్నాయి. భారత్.. 5 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అవుతుందంటున్నారు. అది చాలా తక్కువ. వైఫల్యం ఉంటే.. తప్పు జరిగిందని ఒప్పుకోవాలి. అసలు అభివృద్ధికి తలసరి ఆదాయం సూచన."- కె. చంద్రశేఖర్ రావు, తెలంగాణ సీఎం
ఇవీ చదవండి:
2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేయాలనేది లక్ష్యం: సీఎం కేసీఆర్
అక్రమాలకు తావులేకుండా భవన నిర్మాణ అనుమతులు: కేటీఆర్
'మన్మోహన్ పాలనతో పోలిస్తే.. మోదీ హయాంలో దేశం ఘోరంగా దెబ్బతిన్నది'