KCR At Telangana National Integration Day 2023 : తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో అంతర్భాగమైన సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని భావించామని తెలిపారు. తెలంగాణ నేలపై పలు సందర్భాల్లో అనేక పోరాటాలు జరిగాయని.. ప్రాణాలను కూడా త్రుణప్రాయంగా భావించి ఆ పోరాటాల్లో తెలంగాణ సమాజం గుండెలు ఎదురొడ్డినిలిచిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవంలో కేసీఆర్ పాల్గొన్నారు.
CM KCR Speech At Nampally Public Garden : హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మొదట గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌కు చేరుకుని జాతీయ పతాకావిష్కరణ చేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన సీఎం కేసీఆర్.. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం గురించి ప్రసంగించారు. ఆనాటి ప్రజాపోరాటఘట్టాలు, సామాన్యులు అసామాన్యులై చేసిన త్యాగాలు జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయని కేసీఆర్ పునరుద్ఘాటించారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కుమురంభీం, రావి నారాయణరెడ్డి లాంటి వీరయోధులకు నివాళులర్పిస్తున్నామని తెలిపారు. నాటి జాతీయోద్యమనాయకుల స్ఫూర్తిదాయక కృషిని ఈ సందర్భంగా స్మరించుకుందామని కేసీఆర్ అన్నారు.
Telangana National Integration Day 2023 : 'ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి, ప్రజానీకానికీ తీవ్ర అన్యాయం జరిగింది. మహోద్యమాని(Telangana Movement)కి సారథ్యం వహించడం చరిత్ర నాకందించిన మహదవకాశం. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే గురుతర బాధ్యతను సైతం నా భుజస్కంధాలపైనే మోపారు. రాష్ట్రం సాకారమైన నాటి నుంచి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యావద్దేశానికి ఆదర్శంగా నిలిచాయి.' అని కేసీఆర్ అన్నారు.
"పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలం అవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాది ఒక విషాద గాథ. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది ఒక పోరాట చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటంవల్ల అధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు. హైదరాబాద్ రాష్ట్రం కొనసాగి ఉంటే అప్పర్ కృష్ణా, తుంగభద్ర, భీమాఎడమ కాలువ ద్వారా ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అంది ఉండేది. 60 ఎకరాలు భూమి ఉన్నరైతు కూడా పొట్ట చేతబట్టుకొని కూలి పనులు చేసుకునే దుస్థితికి మనందరం కన్నీటి సాక్షులమే". - కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి
2005లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Palamuru Rangareddy Lift Irrigation Project) రూపకల్పనచేసి రాష్ట్రప్రభుత్వానికి నివేదిక ఇస్తే దాన్ని బుట్టదాఖలు చేశారని కేసీఆర్ మండిపడ్డారు. సుసంపన్నంగా వెలుగొందిన పాలమూరులో గంజి కేంద్రాలు నడపాల్సిన దుర్గతి పట్టించిన నీచ చరిత్ర ఆనాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులదని ధ్వజమెత్తారు. దృఢ సంకల్పంతో పాలమూరు-రంగారెడ్డి పూర్తిచేయాలని సంకల్పిస్తే అడుగడుగునా అడ్డంకులు కల్పించారని విమర్శించారు. మనం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల సాకారం చేసుకోగలిగామన్న కేసీఆర్.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కాల్వల పనుల కోసం ఇప్పటికే ఆదేశాలిచ్చామని తెలిపారు.
76 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా పేదరికం, నిరుద్యోగం, సాంఘిక వివక్ష దేశాన్ని పట్టిపీడిస్తుండటం దురదృష్టకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ వివక్షను దూరం చేయడానికి మానవీయ కోణంలో పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందని కుటుంబమేదీ రాష్ట్రంలో లేదని తేల్చి చెప్పారు. ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అని కేసీఆర్ పునరుద్ఘాటించారు. అభివృద్ధి అంటే ఏమిటో అనతికాలంలోనే దేశానికి చాటిచెప్పగలిగామని అన్నారు. 'తెలంగాణ ఆచరిస్తున్నది-దేశం అనుసరిస్తున్నది' అన్నమాట అక్షర సత్యమని నొక్కివక్కానించారు.
Harish Rao Fires on Congress : 'బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి.. కాంగ్రెస్ చెబుతున్న అబద్దాలకు పోటీ'