KC Venugopal on Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. పీసీసీ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణకు అంగీకరించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. మూడ్రోజుల పాటు విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ, 17న బహిరంగ సభ, 18న రాష్ట్రవ్యాప్తంగా ఛార్జిషీట్ల విడుదల కార్యక్రమాలను నిర్వహించనుంది. సీడబ్ల్యూసీ సమావేశాలు, బహిరంగ సభ ఏర్పాట్లపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమీక్ష నిర్వహించారు. నిన్న హైదరాబాద్ పర్యటనలో భాగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయన.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర నేతలతో కలిసి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలుచోట్ల బహిరంగ సభ ప్రదేశాలను పరిశీలించారు.
Telangana Congress MLA Candidates First List : నెలాఖరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా!
Hyderabad CWC Meeting Arrangements 2023 : బహిరంగ సభ కోసం మైదానాల పరిశీలన అనంతరం, హోటల్ తాజ్ కృష్ణలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీ వేణుగోపాల్.. సీడబ్ల్యూసీ సమావేశం, బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించారు. సీడబ్ల్యూసీ సమావేశానికి పార్టీ జాతీయ నేతలంతా హాజరవుతున్నందున ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ముఖ్యనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీలతో పాటు చాలా మంది నేతలు రెండ్రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉంటారని తెలిపారు. సభ నిర్వహణకు పార్టీ నేతలతో ఆహార, రవాణా, సమన్వయ తదితర కమిటీలను ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలకు మధుయాష్కీ, మహేశ్‌కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, ఇతర నేతలు నాయకత్వం తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెబుతూ.. 5 హామీలపై గ్యారెంటీ పత్రాన్ని బహిరంగ సభలో సోనియాగాంధీ విడుదల చేస్తారని తెలిపారు. ఈ గ్యారెంటీ హామీలను, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలన్నారు. రాష్ట్ర నాయకులంతా ఐక్యంగా పని చేస్తేనే విజయం సాధ్యమని కేసీ వేణుగోపాల్ తెలిపారు.
CWC Meetings in Hyderabad : హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు.. రాష్ట్రంలోనూ 5 గ్యారంటీలతో రెడీ
బహిరంగ సభ కోసం గచ్చిబౌలిలోని క్రీడా మైదానం లక్షల సంఖ్యలో వచ్చే జనానికి సరిపోదని నేతలు భావించారు. అలాగే తుక్కుగూడలోని ఈ-సిటీ పక్కనున్న మైదానం సభ నిర్వహణకు అనువైన స్థలంగా ప్రాథమికంగా నిర్ణయించారు. అదే విధంగా ఎల్బీ స్టేడియంలోనూ ప్రభుత్వం అనుమతి ఇవ్వటంతో.. ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహణకు తాజ్ కృష్ణా హోటల్ అనువుగా ఉంటుందని నేతలు ప్రాథమికంగా నిర్ణయించారు. బహిరంగ సభకు లక్షల మంది జనాన్ని సమీకరించి, విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర నేతలకు సూచించారు. 18న పార్టీ జాతీయ నేతలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి, సభలు నిర్వహిస్తారని, వాటిని విజయవంతం చేయాలని కోరారు.
రాత్రి పొద్దుపోయిన తర్వాత సీపీఐ జాతీయ నేత నారాయణ.. తాజ్ కృష్ణలో కేసీ వేణుగోపాల్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పొత్తులు, ఇతర అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమిలో సీపీఐ ఉన్నందున రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌తో కలిసి వెళ్తామని నారాయణ స్పష్టం చేశారు. రాత్రివేళ జరిగిన భేటీపై స్పందించిన నారాయణ.. రాజకీయాలన్నీ అర్ధరాత్రే జరుగుతాయన్నారు. మరోవైపు.. 2024 సార్వత్రిక ఎన్నికల కాంగ్రెస్ కార్యాచరణ సైతం హైదరాబాద్ వేదికగానే సిద్ధం కానుంది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాలు, సోనియా బహిరంగ సభతో అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.