Kasani Gnaneshwar Will Join BRS Tomorrow : తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా(Kasani Gnaneshwar Resign TDP) చేసిన కాసాని జ్ఞానేశ్వర్.. శుక్రవారం రోజున బీఆర్ఎస్లో చేరనున్నారు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి టీడీపీ పోటీ చేయడం లేదన్న కారణంతో అసంతృప్తి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ రెండు రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేసి.. రేపు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు.
అసలేం జరిగింది : రెండు రోజుల క్రితం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్.. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి అధిష్ఠానం నిరాకరించడంతో తన పదవికి రాజీనామా చేశారు. ఎన్టీఆర్ భవన్లో పార్టీ నేతలతో సమావేశమై.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పార్టీ అధిష్ఠానం ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పగా.. అందుకు శ్రేణులు పోటీ చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురైన కాసాని.. వెంటనే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
అంతకు ముందు ఈ నెల 28న రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్‌లో కాసాని పాల్గొన్నారు. ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదని అధినేత చంద్రబాబునే చెప్పారని.. ఎందుకు అలా అన్నారో తనకు అర్థం కాలేదని తెలిపారు. అదే విషయాన్ని కార్యకర్తలకు వచ్చి చెప్పగా.. అధిష్ఠానం నిర్ణయం పట్ల పార్టీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
కాసాని జ్ఞానేశ్వర్‌పై కేసు నమోదు : మరోవైపు కాసాని జ్ఞానేశ్వర్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. బంజారాహిల్స్‌లోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో కాసాని తనను అడ్డుకొని దాడి చేశారని గుడి మల్కాపూర్‌కు చెందిన గోషామహల్ టీడీపీ సమన్వయకర్త డాక్టర్ ఏ.ఎస్.రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల పార్టీ కార్యాలయం నుంచి పార్టీ సమావేశానికి హాజరు కావాలంటూ తనకు ఫోన్ కాల్ రావడంతో.. అక్కడకు వెళ్లానని బాధితుడు చెప్పారు. అప్పుడు అక్కడే ఉన్న కాసాని జ్ఞానేశ్వర్, సభ్యులు ప్రకాశ్ ముదిరాజ్, రవీంద్రాచారి, భిక్షపతి ముదిరాజ్, ఐలయ్య యాదవ్, బంటు వెంకటేశం, ప్రశాంత్ యాదవ్ తదితరులు తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడిలో తన కుడి కంటిపై గాయమైందని ఫిర్యాదులో వివరించారు.
మగత నెల 29న పార్టీ కార్యాలయానికి వచ్చి డాక్టర్ ఏ.ఎస్. రావు అమర్యాదగా ప్రవర్తిస్తూ.. హల్చల్ చేశారంటూ గోషామహల్ ఇన్‌ఛార్జి ప్రశాంత్ యాదవ్ ఆయనపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనను గతంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వీరిరువురి పరస్పర ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.