Vidyanagar Abhayanjaneya swamy temple karthika pooja: శివుడికి ప్రీతి అయినా కార్తికమాసంలో శివలింగానికి రకరకాల అలంకరణలు చేస్తూ కొలుస్తుంటారు. అందులో భాగంగానే హైదరాబాద్ విద్యానగర్లోని అభయాంజనేయ స్వామి ఆలయంలోని శివలింగానికి నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రోజుకో అలంకారంలో శివుడిని పూజిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. నిన్న కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
కార్తికమాసాన్ని పురస్కరించుకొని చక్కెరతో శివలింగ అలంకరణ, అర్ధనారీశ్వర అలంకరణ, రుద్రాక్షలతో అలంకరణ, కాలభైరవ అలంకరణతో పాటు వివిధ రకాల పండ్లు, పూలు, స్వీట్లతో చేసే అలంకరణ భక్తులను ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 4వ తేదీతో కార్తిక మాసం ముగియనుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి పోయి... ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు పూజారులు తెలిపారు.
కరోనా నుంచి కాపాడాలని... రోగ నివారణ కావాలని... అందరూ ఆనందంగా, ఐశ్వర్యంగా... ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్తిక మాసంలో నిత్యం మహారుద్రాభిషేకం చేస్తున్నాం. పరమశివుని అనుగ్రహంతోనే పాపాలు తొలగిపోతాయి. అప్పుడే ఆనందం అనే యోగ్యతను ఈశ్వరుడు ప్రసాదిస్తాడు. అందుకే భక్తిశ్రద్ధలతో ఆయనను పూజించాలి.
-దిగంబర శర్మ, పురోహితులు
అసుర సంధ్యవేళలో పంచామృతాలతో అభిషేకం, పుష్పోదకము, గంగోదకము, హరిత్రోదకము, భస్మోదకము వంటి విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం, రుద్రాభిషేకం నిత్యం చేస్తున్నాం. కార్తిక మాసం ప్రారంభమైననాటి నుంచి ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాం. అభిషేకంతో పాటు రోజుకొక విశేష అలంకరణ... భస్మా అలంకరణ, పుష్పాలంకరణ, డ్రైఫ్రూట్స్, స్వీట్లతో, రంగులతో ఇక కార్తిక మాసం చివరి సోమవారం కాలభైరవ అలంకరణంలో స్వామివారు కొలువై ఉన్నారు. ముప్పై రోజుల్లో ముప్పై అలంకరణల్లో స్వామివారు కొలువుదీరుతున్నారు.
-దత్తాత్రేయ శర్మ, పురోహితులు
ఇదీ చదవండి: DOLLAR SESHADRI FUNERALS: నేడు డాలర్ శేషాద్రి అంత్యక్రియలు.. హాజరుకానున్న సీజేఐ