Kharmanghat issue update : మంగళవారం రాత్రి కర్మన్‌ఘాట్ వద్ద గోవులను అక్రమంగా తరలిస్తున్న వారితో పాటు ఉద్రిక్తతకు కారణమైన ఏడుగురిని మీర్‌పేట్ పోలీసులు అరెస్టు చేశారు. భవానీనగర్‌కు చెందిన మహ్మద్ యూసుఫ్, మహ్మద్ నిసార్, మహ్మద్ నవాజ్‌తో పాటు మరో నలుగురు బోలేరో వాహనంలో గోవులను తరలిస్తుండగా... మార్గంమధ్యలో గాయత్రీనగర్ వద్ద కొందరు గోరక్షక్ దళ్ సభ్యులు వాహనాన్ని ఆపమని కోరారు. ఈ క్రమంలో వారు వాహనాన్ని నిలపకుండా ముందుకు వెళ్లిపోయారు. వారిని వెంబడించి వాహనాన్ని నిలపడంతో... గోవులను తరలిస్తున్న వారు గోరక్షక్ దళ్ సభ్యులపై కర్రలతో దాడి చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ వ్యవహారంపై పలు సెక్షన్‌ల కింద ఐదు కేసులు నమోదు చేశారు. ఏడుగురిని అరెస్టు చేసి... మూడు గోవులు, రెండు గేదలు, బొలేరో వాహనం, ద్విచక్ర వాహనంతో పాటు ఇనుప రాడ్లు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
శాంతించిన పరిస్థితులు
హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో ఉద్రిక్త పరిస్థితులు శాంతించాయి. గోరక్షకులపై దాడికి పాల్పడిన దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం... గోవులను తిరిగి గోశాలకు తరలించడంతో సమస్య సద్దుమణిగినట్లు ఏసీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. దాడికి గురైన బాధితులు, వారి మద్దతు దారులను శాంతింపజేసేందుకు పోలీస్ ఉన్నతాధికారులు తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటనలో ఇరువర్గాలు సంయమనం పాటించాలని, భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హామీ ఇచ్చారు. మరోవైపు ఘటనాస్థలికి సీపీ మహేష్ భగవత్ చేరుకొని శాంతి భద్రతలను పర్యవేక్షించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ఆలయ పరిసరాల్లో పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. ఆలయాన్ని సంప్రోక్షణ చేసి గోరక్షకులపై దాడికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, భాజపా నాయకులు డిమాండ్ చేశారు.
ఖండించిన మురళీధర్‌రావు
మంగళవారం రాత్రి కర్మన్‌ఘాట్‌లో గోరక్షకులపై జరిగిన దాడిని భాజపా నేత మురళీధర్‌రావు తీవ్రంగా ఖండించారు. దాడిలో గాయపడిన కార్యకర్తల పైనే పోలీసులు కేసులు పెట్టడం దారుణమన్నారు. దేవాలయాలపై దాడిని హేయమైన చర్యగా అభివర్ణించిన ఆయన... అపవిత్రమైన దేవాలయాన్ని సంప్రోక్షణ చేయించామన్నారు. దాడిపై ఏమాత్రం స్పందించని తెరాస నేతలు ఉగ్రవాదులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.
కర్మన్‌ఘాట్‌లో గోరక్షకులపై జరిగిన దాడి దారుణం. గాయపడిన కార్యకర్తలపైనే పోలీసులు కేసులు పెట్టారు. దేవాలయాలపై దాడి హేయమైన చర్య. అపవిత్రమైన దేవాలయాన్ని సంప్రోక్షణ చేయించాం. దాడులు ఇలాగే కొనసాగితే తెరాస నేతల్ని నిద్రపోనివ్వం.
- మురళీధర్‌రావు, భాజపా నేత
ఏం జరిగింది?
గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ గోరక్షక సేవాసమితి సభ్యులు.. టీకేఆర్ కమాన్ వద్ద వాహనాన్ని అడ్డగించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వాహనాలు దెబ్బతినడంతో పాటు, గోరక్షకులపై తరలింపుదారులు దాడికి పాల్పడ్డారు. గోరక్షకుల నుంచి తప్పించుకునేందుకు తరలింపుదారులు దగ్గరలోని హనుమాన్ ఆలయంలో తలదాచుకున్నారు. వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలంటూ యువకులు రాత్రంతా నిరసన చేపట్టారు. తమపై దాడికి పాల్పడ్డ దుండగులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను గోసంరక్షకులు డిమాండ్ చేశారు.
రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆందోళన
మంగళవారం(ఫిబ్రవరి 22) రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఆందోళన.. తెల్లవారుజామున(ఫిబ్రవరి 23) 3 గంటల వరకు సాగింది. ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పలువురిని అరెస్టు చేసి వాహనాల్లో తరలించారు. ఆగ్రహానికి గురైన యువత పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలు పోలీస్ స్టేషన్ల నుంచి అదనపు బలగాలను మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టి, మెజార్టీ యువకులను అరెస్టు చేసి మీర్‌పేట్, సరూర్‌నగర్ పీఎస్‌లకు తరలించడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేంత వరకు తాము ఊరుకోబోమని ఆందోళనను కొనసాగిస్తామని గోరక్షక సేవ సమితి సభ్యులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: TTD Special Darshan Tickets: తిరుమల టికెట్ల బుకింగ్‌లో సాంకేతిక సమస్య