తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నందునే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టం చేశారు. కార్ఖానాలో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ను... మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. ఆధునిక పోలీసు స్టేషన్‌ల నిర్మాణం, కొత్త వాహనాలు, సాంకేతికతతో కూడిన సౌకర్యాలు పోలీసులకు అందుతున్నాయని వివరించారు. పోలీసు శాఖలో త్వరలో 20వేల పోస్టులను భర్తీ చేస్తామని మహమూద్ అలీ ప్రకటించారు.
హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు వచ్చాయని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. నిజాం కాలం నాటి పోలీస్ స్టేషన్లను ఆధునీకరించి అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. ప్రజల సహకారంతో 3 కమిషనరేట్ల పరిధిలో కలిపి 6.5 లక్షల సీసీటీవీలు ఏర్పాటు చేశామని... నేరాల నియంత్రణలో ఇవి ఎంతగానో తోడ్పడుతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ పెట్టుబడులు పెట్టేలా అత్యంత సురక్షిత నగరంగా పేరు సంపాదించుకుందని సీపీ అంజనీకుమార్ తెలిపారు. పోలీసుల చేతికి ఆయుధాల బదులు ట్యాబ్‌లు అందించి వివరాలు నమోదు చేసుకునేందుకు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న సీసీటీవీల సంఖ్యను పెంచి నగరమంతా నిఘా ఉంచుతామని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎన్ని నిధులైనా వెచ్చించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: అధునాతన సౌకర్యాలతో పేదవారికి ఇళ్లు నిర్మించాం: కేటీఆర్