Harishrao review of Kantivelugu program: కంటి సమస్యలతో రాష్ట్రంలోని ప్రజలు ఎవరు బాధ పడకూడదనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమంపై మంత్రి హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కంటి సమస్యలు తొలగించేందుకు మరోసారి జనవరి 18 నుంచి కంటివెలుగు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈసారి కోటిన్నర మందికి పరీక్షలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఈ పరీక్షల్లో 55 లక్షల మందికి కళ్లద్దాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. కంటివెలుగు రెండో దశకు ప్రభుత్వం రూ.200కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో నమోదయ్యేలా ఈసారి అందరూ కృషి చేయాలని కోరారు. కంటివెలుగులో బాగా పనిచేసే వారికి ప్రశంసలు ఉంటాయని, అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని జిల్లాల్లో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా జరిపించడం, సహాయ సిబ్బందికి శిక్షణ తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు.
తొలివిడతలో 100 శాతం లక్ష్యసాధన: తొలి విడత కంటి వెలుగు కార్యక్రమం ఆగస్టు 15 2018లో ప్రారంభమై.. 2019 మార్చి 31తో ముగిసింది. రాష్ట్రంలోని 9,887 గ్రామాల్లో 1,54,71,769 మందికి కంటి పరీక్షలు నిర్వహించడంతో లక్ష్యం వంద శాతానికి చేరింది. రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు కంటి పరీక్షలు పొందిన జిల్లాల్లో హైదరాబాద్(8,92,256) మొదటి స్థానంలో నిలవగా, రంగారెడ్డి(8,60,891), మేడ్చల్(8,28,822) జిల్లాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా 24,67,481 మందికి సాధారణ దృష్టిలోపాలను సరిచేసే కళ్లద్దాలు అవసరమని గుర్తించగా.. ఇప్పటి వరకూ 23,41,636(94.9శాతం) మందికి అందజేశారు.
ఇవీ చదవండి: