problems for funerals: ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలకు.. మనిషి బతికున్నప్పుడే కాదు చనిపోయాక కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కడప జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అతడికి అంత్యక్రియలు చేసేందుకు.. మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకువెళ్లారు. కానీ అంతిమ సంస్కారాలు చేసేందుకు బంధువులు, కుటుంబ సభ్యులు నానా ఇబ్బందులు పడ్డారు.
మృతదేహాన్ని ఖననం చేసేందుకు శ్మశాన వాటికలో ఎక్కడ గుంత తవ్వినా.. నీరు పైకి ఉబికి వచ్చింది. అలా ఐదారు చోట్ల తవ్వి చూసినా ఫలితం లేకుండాపోయింది. శ్మశాన వాటిక మొత్తం చెరువులా తయారైంది. ఇక చేసేదేం లేక మృతదేహాన్ని నీటిలోనే పూడ్చిపెట్టాలని నిర్ణయానికొచ్చారు.
నీటిలోనే.. పూడ్చి పెట్టేశారు!
పొక్లెయిన్ సాయంతో.. నీళ్లలోనే గుంత తీయించారు. మృతదేహాన్ని నీటిలో అదిమి పట్టుకొని దానిపై ట్రాక్టర్ల సాయంతో మట్టి వేయించారు. దాదాపు రెండు ట్రాక్టర్ల మట్టి వేసి మృతదేహాన్ని కప్పి పెట్టారు. ఈ దృశ్యాలను చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అంత్యక్రియలు ఇలా చేయాల్సి రావడం చాలా బాధగా ఉందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కోరారు.
ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు
ఏపీ ఉత్తరాంధ్ర పరిసర జిల్లాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈనెల 4 నాటికి తుపానుగా మారి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయగోదావరి జిల్లాలపై పెను ప్రభావం చూపే అవకాశముంది. డిసెంబర్ 3, 4 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతోపాటు.. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
heavy rains in ap: దక్షిణ ధాయ్‌లాండ్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి గురువారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. శుక్రవారం (డిసెంబర్ 3) బంగాళాఖాతంలో తుపానుగా మారనుంది. తర్వాత ఇది వాయువ్య దిశగా ప్రయాణించి.. మరింత బలపడుతూ నాలుగో తేదీ నాటికి ఉత్తరాంధ్ర - ఒడిశా తీరాలను చేరే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.
ఇదీ చూడండి: Lung transplant surgery: నిమ్స్‌లో తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స