Kishan Reddy on Bio Medical Research at genome valley: హైదరాబాద్ నగరం వైద్య రంగానికి అనుకూల వాతావరణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అందుకే జీనోమ్ వ్యాలీలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ పేరుతో 'నేషనల్ యానిమాల్ రిసెర్చ్ ఫెసిలిటి ఫర్ బయో మెడికల్ రిసెర్చ్' పరిశోధన సంస్థను ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఈ సంస్థను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుక్ మాండవ్య.. ఏప్రిల్ 2న ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సంస్థ తెలంగాణకు మంచి గుర్తింపు తీసుకువస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఫార్మా రాజధాని ఉన్న హైదరాబాద్‌లో ఈ పరిశోధన సంస్థ రావడం చాలా ప్రయోజనకరమని కిషన్‌రెడ్డి అన్నారు. జంతు సంబంధిత పరిశోధన కోసం దేశంలోనే కాకుండా దక్షిణాసియాలోనే ఏర్పాటు చేసిన తొలి సంస్థ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో ఈ రీసెర్చ్ సెంటర్ పనిచేస్తుందన్నారు. 4 లక్షల అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సంస్థలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జంతువులను పెంచుతామని కేంద్రమంత్రి వివరించారు.
"రానున్న రంగంలో ఆరోగ్యానికి సంబంధించి.. కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జీవపరిశోధన కోసం హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో "నేషనల్ యానిమల్ రిసెర్చ్ ఫెసిలిటీ బయోమెడికల్ రీసెర్చ్"ను ప్రారంభించనున్నాం. 100 ఎకరాల స్థలంలో భవనాలు నిర్మించాం. జాతీయ జంతువనరుల సౌకర్యం, జీవ వైద్య పరిశోధన సంస్థ కోసం రూ. 400 కోట్లతో దీన్ని నిర్మించాం. ఈ సంస్థ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌కు మంచి గుర్తింపు వస్తుంది." -కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి
కేంద్ర ప్రభుత్వం సైన్స్ సిటీ, గిరిజన మ్యూజియం సహా ఎన్నో అభివృద్ధి పనులు మంజూరు చేసినా... రాష్ట్రం సహకరించడంలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. అదే విధంగా రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రోజు వరంగల్‌లో వేడుకలను గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రారంభిస్తారని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రికి ఆహ్వానించకపోయినా తర్వాత వెళ్లి దర్శించుకుంటామని వెల్లడించారు.
ఇదీ చదవండి: నెలలోగా ఆ సమస్యను పరిష్కరించండి: కేంద్రమంత్రి గడ్కరీ