TS Panchayat Secretaries Joined Their Duties : క్రమబద్ధీకరణ సహా పలు డిమాండ్లతో ఏప్రిల్ 28 నుంచి 16 రోజులుగా తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేసిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోపు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించడంతో... చాలా మంది విధుల్లో చేరారు. దీంతో జేపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్ ఇతర ప్రతినిధులు శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో చేరిన పంచాయతీ కార్యదర్శులు : తాము యథావిథిగా విధులు నిర్వహిస్తామని తమకు తగిన న్యాయం చేయాలని మంత్రి ఎర్రబెల్లిని వారు కోరారు. వారి సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఎర్రబెల్లి భరోసా ఇచ్చారు. దీంతో వారు మంత్రితో జరిపిన చర్చలు ఫలించడంతో సోమవారం నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరారు.
ప్రభుత్వ ఆదేశాలతో దిగొచ్చిన జేపీఎస్‌లు : మొదట తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని.. తమను బెదిరిస్తే సమ్మె మరింత ఉద్ధృతం చేస్తామని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రకటించారు. ఈక్రమంలోనే ప్రభుత్వం వారిని నోటీసుల పేరుతో భయపెట్టింది. గత మంగళవారం నాటికి సమ్మె ముగించాలని లేకుంటే ఉద్యోగాలు నుంచి తీసేస్తామని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఆదివారం వరకు ఎవరైనా విధుల్లో చేరకుంటే వారి స్థానంలో కొత్తగా తాత్కాలిక జేపీఎస్‌లను నియమించాలని సూచించింది. ఏ మాతం లెక్క చేయని జేపీఎస్‌లు సమ్మె విషయంలో వెనక్కి తగ్గలేదు.
ఈ క్రమంలో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. శనివారం మధ్యాహ్నం వరకు సమయం ఇచ్చింది. దీంతో కొందరు విధుల్లో జాయిన్ కాగా మరికొందరు సమ్మెలో పాల్గొన్నారు. ఈ మేరకు జేపీఎస్ సంఘం ప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లితో జరిపిన చర్చలు ఫలించడంతో వారు సోమవారం నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరారు. దీంతో పల్లె పాలనకు ఆటంకం తొలగినట్లయింది.
ఇవీ చదవండి: