Junior doctors strike notice: స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన స్టైఫండ్ పెంచాలని కోరుతున్నట్లు జేఏసీ నేత తెలిపారు. 2020లో పెంచిన స్టైఫండ్ నేటికీ అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2021 జనవరి నుంచి పెంచాల్సి ఉన్నా ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు.
అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్టైఫండ్ హైక్ ఏపీలో 15శాతం మాత్రమే ఇస్తున్నారని వెల్లడించారు. మన పక్కనున్న తెలంగాణ, ఒడిశా వంటి రాష్ట్రాల్లో రెట్టింపు ఇస్తున్నారని పేర్కొన్నారు. తమతో పాటు పనిచేసే జుడాలు ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ వస్తుందని అన్నారు. మరి తాము ఏం పాపం చేశామని, దేశంలోనే తక్కువ ఇచ్చే రాష్ట్రం ఏపీ మాత్రమేనని విమర్శించారు.
వైద్య రంగానికి ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్న సీఎం, తమ ఇబ్బందులపై దృష్టి పెట్టాలని కోరారు. ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తున్నా, శ్రమకు తగ్గ గుర్తింపు లేదని వెల్లడించారు. ఇప్పటికే ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేశామని సమ్మె నోటీసు ఇచ్చాం. శాంతియుత మార్గంలో నిరసనలు తెలుపుతున్నామన్నారు.
ఈనెల 26న ఓపీ సేవలు, 27నుంచి అత్యవసర సేవలు మినహా ఇతర డ్యూటీలను బాయ్ కాట్ చేస్తామని పేర్కొన్నారు. అధికారులు చేస్తాం అంటున్నారే తప్ప, అమలుకు నోచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారైనా సీఎం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తారని భావిస్తున్నామన్నారు. కరోనా సమయంలో కూడా తాము ప్రాణాలు లెక్క చేయకుండా పని చేశామని తెలిపారు. సర్వీసుల్లో తామెప్పుడూ స్వార్ధం చూసుకోలేదని ప్రభుత్వాన్ని కూడా తమకు న్యాయ బద్దంగా ఇవ్వాల్సిన స్టైఫండ్‌ను కోరుతున్నామని స్పష్టం చేశారు.
ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే నలభై శాతం స్టైఫండ్ హైక్ అయ్యాయని ఏపీలో మాత్రం పాత విధానంలోనే అమలవుతుందని ధ్వజమెత్తారు. ఉన్నతాధికారులు హామీలు ఇస్తున్నా అమలు మాత్రం అవడం లేదు, సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి తమకు స్టైఫండ్ ఇవ్వాలని కోరారు.
ఇవీ చదవండి: