రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు పరచబోతున్న... ‘సీఎం దళిత్ ఎంపవర్ మెంట్’’ పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన కోసం సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఎల్లుండి ప్రగతి భవన్లో ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్న అఖిలపక్ష సమావేశం సుదీర్ఘంగా సాగనుంది.
ఎస్సీ ప్రజా ప్రతినిధులతో కూడిన ఈ అఖిలపక్ష సమావేశంలో, రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన ఎస్సీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. వారితోపాటు ఎంఐఎం, కాంగ్రెస్, భాజపా పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు కూడా హాజరుకానున్నారు. వీరికి అధికారికంగా ఆహ్వానాలు అందనున్నాయి. సీపీఐ, సీపీఎం పార్టీల నుంచి సీనియర్ ఎస్సీ నేతలను సమావేశానికి పంపించాల్సిందిగా... ఇప్పటికే ఆయా పార్టీల అధ్యక్షులు చాడ వెంకట్ రెడ్డి(chada venkat reddy), తమ్మినేని వీరభధ్రం(tammineni veerabhadram)లకు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు.
అదే విధంగా ఎస్సీ సమస్యల పట్ల అవగాహన ఉండి, ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న... రాష్ట్రంలోని ఇతర సీనియర్ దళిత నాయకులను కూడా ఆహ్వనించాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంవో అధికారులతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా సమావేశానికి రానున్నారు.
రాష్ట్రంలో స్వయం పాలన ప్రారంభమైన అనతి కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో... అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం పాటుపడుతుందన్నారు. ఈ క్రమంలో ఎస్సీల జీవితాల్లో గుణాత్మకంగా అభివృద్ధిని సాధించాలంటే.. ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలనే విషయం గురించి... ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. ఎస్సీల సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా క్షుణ్ణంగా చర్చించి విధివిధానాలను ఖరారు చేయడానికి... ఈ అఖిలపక్ష సమావేశం జరపాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
ఇదీ చూడండి: మరియమ్మ లాకప్‌డెత్‌పై సీఎం సీరియస్.. బాధిత కుటుంబానికి భరోసా