అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఎంతోమంది వలస కూలీలు పొట్టచేత పట్టుకొని బతుకుదెరువు కోసం నగరానికి వస్తుంటారు. నేరచరిత్ర ఉన్న కొందరు పనిలో చేరిన తర్వాత చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అదను కోసం ఎదురు చూసే వీళ్లు అవకాశం రాగానే ఇంట్లోని బంగారం, నగదు తీసుకొని ఉడాయిస్తున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోనూ చోటుచేసుకుంది.
చోరీ చేశారు... పరారయ్యారు....
బంజారాహిల్స్‌లో నివాసముంటున్న కపిల్ గుప్తా అనే బడా వ్యాపారి ఇంట్లో బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి వంటవాడిగా చేరాడు. ఓరోజు యజమాని కుటుంబంతో సహా విందు భోజనానికి వెళ్లాడు. కోటిన్నర విలువ చేసే బంగారం, కోటి రూపాయల విలువ చేసే వజ్రభరణాలు మాయమయ్యాయి. గతేడాది డిసెంబర్ 8న ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దోపిడికి పాల్పడింది బీహర్ ముఠాగా గుర్తించారు. కపిల్ గుప్తా ఇంట్లో దోపిడి చేసిన వ్యక్తికి మరో ఐదుగురు సహకరించినట్లు గుర్తించిన పోలీసులు,బీహార్ వెళ్లి నిందితులను అరెస్ట్ చేశారు. ఆ ముఠా 8 రాష్ట్రాల్లో ఇదే తరహాలో చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. చోరీ చేసిన సొత్తును ముఠా సభ్యులు పంపకాలు చేసుకొని..ఆ మొత్తాన్ని ఇంటిగోడల్లో తవ్వి పాతిపెట్టి ఎవరికి దొరకకుండా జాగ్రత్తపడతారు. ఈ తరహా గ్యాంగ్‌లు నగరంలో మకాం వేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
వృద్ధ దంపతుల ఆహారంలో మత్తుమందు కలిపి..
రాజేంద్రనగర్‌లో ఓ వృద్ధ దంపతుల ఇంట్లో నేపాల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు పనివాళ్లుగా కుదిరారు. ఓ రోజు వారికి భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లాక.. ఇంట్లోని బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. అనంతరం స్వస్థలానికి వెళ్లిపోయారు. సైబరాబాద్ పోలీసులు నేపాల్ వెళ్లి చోరీకి గురైన కొంత సొత్తు రికవరీ చేసినా నిందితులను హైదరాబాద్‌కు తీసుకురాలేకపోయారు. ఇలాంటి ఘటనలు నగరంలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇళ్లల్లో పనివాళ్లను నియమించుకునే సమయంలో వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి...
హైదరాబాద్ రోజురోజుకూ విస్తరిస్తుండటంతో ఉపాధికోసం వివిధరాష్ట్రాలకు చెందినవారుపెద్దసంఖ్యలో వస్తున్నారు. వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: కోటి విలువగల బంగారం పట్టివేత... ఆరుగురి అరెస్ట్