లాక్‌డౌన్ సడలింపుతో రాష్ట్రంల కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగుల సంఖ్య పెరిగింది. వ్యక్తిగత దూరం పాటిస్తూ చిన్నతరహా పరిశ్రమలు, యూనిట్లను నడిపించుకునేందుకు అనుమతులు జారీ చేస్తుండటం వల్ల వాటిలోనూ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. వీటన్నింటి ఫలితంగా రహదారులపై రద్దీ పెరిగింది. హైదరాబాద్ నగరంలో ప్రజారవాణా ఇంకా ప్రారంభం కాకపోవడం, ఆటోలు, క్యాబ్‌లు అందుబాటులోకి రాకపోవడంతో చాలామంది కార్యాలయాలకు చేరుకునేందుకు అవస్థలు పడ్డారు. పలువురు వ్యక్తిగత వాహనాలపై రాకపోకలు సాగించారు. అవి లేనివారు ఇళ్లకే పరిమితమయ్యారు.
పూర్తి స్థాయిలో రెవెన్యూ సేవలు
లాక్‌డౌన్ విధించిన తరువాత తొలిసారి సోమవారం రెవెన్యూ కార్యాలయాలకు ప్రజలు వచ్చారు. కొద్ది రోజుల వరకు అపరిష్కృతంగా ఉన్న పనులను మాత్రమే పూర్తిచేసిన సిబ్బంది సోమవారం నుంచి కార్యాలయాల్లోకి ప్రజలను అనుమతించడం ప్రారంభించారు. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్లు పెరుగుతుండటంతో ఆ మేరకు భూ యాజమాన్య హక్కు బదిలీ(మ్యుటేషన్) దరఖాస్తులు పెరుగుతున్నాయి.
భూ క్రయవిక్రయాలు పూర్తికాగానే యజమానులు తహసీల్దార్లకు మ్యుటేషన్ అర్జీలు ఇస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న వాటిని పూర్తి చేయాలంటూ కొందరు కార్యాలయాలకు వస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు నిధుల విడుదలకు సంబంధించి క్షేత్రస్థాయి విచారణను కూడా ప్రారంభించారు.