రాష్ట్రంలో ఒకేసారి మూడు వజ్రాలు, బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమలు (Jewellery Manufacturing)ఏర్పాటు కానున్నాయి. గత నెలలో మలబార్ గోల్డ్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత క్యాప్స్‌గోల్డ్, హంటన్ రిఫైనర్స్ సంస్థల ప్రతినిధులూ ఆయనను కలిశారు. పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధత తెలిపారు. తాజాగా ఈ మూడు సంస్థలకు ప్రభుత్వం 20 ఎకరాల భూములు కేటాయించింది. మొత్తం రూ.1,033 కోట్ల పెట్టుబడులతో 2,800 మందికి ఉపాధి కల్పించేందుకు అవి అంగీకారం తెలిపాయి. టీఎస్‌ఐపాస్ కింద రాయితీలు, ప్రోత్సాహకాలను ఇవ్వడానికి సర్కారు నిర్ణయించింది. బంగారం, వజ్రాలు, వెండి ఆభరణాల పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్నాయి. వినియోగదారుల ఆదరణ, వన్నె తరగని మార్కెటింగు, ఉపాధితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపేణా ఆదాయం సమకూరుతోంది. తెలంగాణను ఆభరణాల రంగంలోనూ పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పారిశ్రామిక విధానంలో 14 ప్రాధాన్య రంగాలలో ఒకటిగా గుర్తించింది. ఆభరణాల విక్రయ రంగంలో హైదరాబాద్ ప్రఖ్యాతిగాంచిన కేంద్రం.
హైదరాబాదీ ముత్యాలు, స్థానిక కళాకారులు తయారు చేసిన లక్క కంకణాలు ప్రసిద్ధి చెందాయి. ఈ సంప్రదాయ ఉత్పత్తులకు విలువను జోడించడంతో పాటు ఆభరణాల ఉత్పత్తి ద్వారా హస్తకళాకారులకు ఊతమివ్వాలని సర్కారు భావించింది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ ముత్యాలు, ఆభరణాల ప్రత్యేక ఆర్థిక మండలి నడుస్తోంది. ముంబయికి చెందిన గీతాంజలి గ్రూప్ అందులో వజ్రాల శుద్ధి పరిశ్రమను నిర్వహిస్తోంది. ఆభరణాలతో పాటు వజ్రాలు పొదిగిన గడియారాలూ తయారు చేస్తున్నారు. ఆభరణాల తయారీ, వజ్రాల కటింగ్, పాలిషింగ్ యూనిట్లు, పరీక్ష కేంద్రాలు, ప్రయోగశాలలు, ధ్రువీకరణ కేంద్రాలు, బ్యాంకులు, వ్యాపార కేంద్రాలు నడుస్తున్నాయి.
సెజ్ సమీపంలోని పార్కులో భూకేటాయింపులు
హైదరాబాద్ ప్రాశస్త్యం దృష్ట్యా ఇక్కడ వజ్రాలు, బంగారు ఆభరణాల తయారీ పెద్దఎత్తున చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం పలు పేరొందిన సంస్థలతో చర్చలు జరిపింది. మూడు సంస్థల ప్రతినిధులు విడివిడిగా పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావును కలిసి తమ ప్రతిపాదనలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటికి సెజ్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన పారిశ్రామిక పార్కులో భూములను కేటాయించింది. మరో ఆరు సంస్థలు సైతం ఆసక్తి చూపాయి. వాటి విషయంలో సంప్రదింపులు జరుగుతున్నాయి. మరో నెలరోజుల్లో స్పష్టత వస్తుందని పరిశ్రమల ఉన్నతాధికారి తెలిపారు.
ఇవీ చదవండి:
- engili pula bathukamma 2021: సింగిడిలోని రంగులు.. తీరొక్క పూలతో కొలిచే బతుకమ్మ.. అచ్చమైన ప్రకృతి పండుగ
- Bathukamma day 2: రెండో రోజు 'అటుకుల బతుకమ్మ'.. నైవేద్యం ఏంటంటే?
- Bathukamma day 3, 2021: మూడో రోజు 'ముద్దపప్పు బతుకమ్మ' విశేషాలు..
- Bathukamma DAY-4: నాలుగో రోజు'నానబియ్యం బతుకమ్మ'.. ఎలా చేయాలంటే?
- Bathukamma Festival: ఐదో రోజు 'అట్ల బతుకమ్మ'.. ప్రత్యేకతలు ఏంటంటే..!