Jeevandan Trust: పట్టుమని 12 ఏళ్ల వయసు దాటలేదు. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ బాలుడిని మృత్యువు కబళించింది. తీవ్రంగా గాయపడటంతో బ్రెయిన్‌డెడ్‌గా వైద్యులు గుర్తించారు. ఆ చిన్నారి తల్లిదండ్రులు దుఃఖాన్ని దిగమింగుకొని అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. బాలుడి నుంచి సేకరించిన అవయవాలతో వైద్యులు 8 మంది జీవితాలను కాపాడారు. ఇటీవలి హైదరాబాద్‌లో ఈ సంఘటన జరిగింది.
ఇది ఉదాహరణ మాత్రమే. ఇలా ఎంతోమంది పెద్ద మనసుతో ముందుకొచ్చి తమ వారి అవయవాలను దానం చేసి అభాగ్యులను ఆదుకుంటున్నారు. నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా దాని ప్రాముఖ్యం తెలుసుకుందాం...
పదివేల మందికిపైగా ఎదురుచూపులు: ప్రస్తుతం అవయవాల కోసం ప్రభుత్వ కార్యక్రమైన జీవన్‌దాన్ వద్ద మొత్తం 10916 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఎదురు చూస్తున్నారు. మూత్రపిండాల కోసం 5424 మంది, కాలేయం కోసం మరో 4931 మంది నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జీవన్‌దాన్ ట్రస్టు ఏర్పాటై 10 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకు 1087 మంది 4132 అవయవాలను దానం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రస్తుతం విజయవంతంగా ఈ తరహా శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. అందులోనూ హైదరాబాద్ ముందుంటోంది. ఇటీవల నిమ్స్, ఉస్మానియాలో జరుగుతున్న అవయవ మార్పిడిలే ఇందుకు ఉదాహరణ. మరోవైపు జీవన్‌దాన్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఏ ఆసుపత్రిలో బ్రెయిన్‌డెడ్ అయితే ఆ ఆసుపత్రికి గుండె, కాలేయం, ఒక కిడ్నీ ఇవ్వాలి. మిగతావి బయట ఆసుపత్రికి పంపుకోవచ్చు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో బ్రెయిన్‌డెడ్ అయినా అవయవదానానికి కుటుంబ సభ్యులు ముందుకు రావడం లేదు. నిరక్షరాస్యత కారణంగా వారిలో చైతన్యం కొరవడుతోంది. ఉస్మానియా, గాంధీలో నెలకు 10-15 బ్రెయిన్‌డెడ్ కేసులు నమోదు అవుతున్నా సరే ఇందులో అవయవాలు దానం చేసేందుకు 1 శాతం కూడా ముందుకు రావడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితిలో కొంత మార్పు వస్తోంది.
జిల్లాలకు విస్తరించేందుకు ప్రణాళిక: "అవయవదానంపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలి. జిల్లాల్లో సైతం ఈ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఇందుకు నిపుణులైన వైద్యులు, మౌలిక వసతులు అవసరం ఉంది. ట్రస్టు ఏర్పాటు చేసే నాటితో పోల్చితే చైతన్యం పెరిగింది. అయితే అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ఇంకా మనవద్ద చాలా తక్కువ మందే ముందుకు వస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని భావిస్తున్నాం." - డాక్టర్ స్వర్ణలత, కోఆర్డినేటర్, జీవన్‌దాన్ ట్రస్టు
చిన్న గాటుతోనే అవయవాలు సేకరిస్తారు: "అవయవదానం అంటే చాలామందికి అపోహ ఉంటుంది. భౌతికకాయం యథావిధిగా అప్పగిస్తారా.. లేదా..అని సందేహిస్తుంటారు. అందుకే బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులను తొలుత కౌన్సిలింగ్ చేస్తాం. కేవలం ఛాతి కింద ఒక చిన్న కోత పెట్టి అన్ని అవయవాలు సేకరిస్తారు. శరీరంపై ఇంకా ఎక్కడ ఎలాంటి కోతలు ఉండవు. వారికి ధ్రువీకరణ పత్రం కూడా అందిస్తారు. అంతిమ సంస్కారాలకు ఎలాంటి ఆటంకం ఉండదు." - మంగాదేవి, ఆర్గాన్ డొనేషన్ కౌన్సిలర్, కిమ్స్
ఇవీ చదవండి: Eamcet Results: ఎంసెట్ ఫలితాలు విడుదల.. త్వరలోనే కౌన్సెలింగ్ ప్రారంభం