రాష్ట్రంలో లావు రకాల ధాన్యాన్ని ఏ గ్రేడ్ కింద క్వింటాకు రూ.1,888, సన్నరకాలను సాధారణ రకం కింద 1,868 చొప్పున ప్రకటించారని కొన్ని జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వరి గింజ పొడవు, వెడల్పు నిష్పత్తి 2.5 మి.మీ.లు లేదా ఆపైన ఉంటే వాటికి ఏ గ్రేడ్ కింద మద్దతు ధర చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. దీనిపై ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశీలన జరిపి రాష్ట్ర రైతులు సాగుచేసిన సన్నరకాలైన సాంబమసూరి(బీపీటీ 5204), తెలంగాణ సోనా(ఆర్‌ఎన్‌ఆర్ 15048) వరి ధాన్యం ఏ గ్రేడ్ కిందకు వస్తాయని.. వాటికి క్వింటాకు రూ.1,888 చొప్పున చెల్లించాలని చెప్పినట్లు వర్సిటీ పరిశోధన సంచాలకుడు జగదీశ్వర్ ‘ఈనాడు ఈటీవీ భారత్’కు తెలిపారు.
ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో 52.55 లక్షల ఎకరాల్లో వరి పంట వేయగా అందులో 70 శాతం వరకూ సన్నరకాల వరి వంగడాలనే రైతులు సాగు చేసినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 41.76 లక్షల ఎకరాలు కాగా అందులో 25 లక్షల ఎకరాల్లో సన్నరకాలు వేయించాలని వ్యవసాయశాఖ సీజన్‌కు ముందు లక్ష్యంగా పెట్టుకుంది. సీజన్ సాగు మరో 26 శాతం అదనంగా పెరిగి 52.55 లక్షల ఎకరాలకు చేరింది. ఇందులో సన్నరకాల సాగు విస్తీర్ణం 35 లక్షల ఎకరాలు దాటింది.
అటు వర్షాలు.. ఇటు తెగుళ్లు
అధిక వర్షాలు, తెగుళ్లు సన్నరకం వరి పైరుకు శాపాలుగా మారాయి. జులై నుంచి అక్టోబరు 3వ వారం వరకు కురిసిన వర్షాలు వరితో పాటు అనేక పంటలను బాగా దెబ్బతీశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో దేవరాజు అనే రైతు తెలంగాణ సోనా సన్నరకం వరిని రెండెకరాల్లో సాగుచేస్తే తెగుళ్లతో పాడైందని పంటకు నిప్పు పెట్టాడు. దీనిపై ఆచార్య జయశంకర్ వర్సిటీ డాట్ సెంటర్ శాస్త్రవేత్తలను పంపి పరిశీలన చేయించింది. ఈ మండలంలో జూన్ 1 నుంచి అక్టోబరు 24 నాటికి సాధారణ వర్షపాతం 744 మిల్లీమీటర్లు(మి.మీ.) కురవాలి. కానీ 1173.9(సాధారణంకన్నా 58 శాతం అదనం) మి.మీ.కురిసింది. అధిక వర్షాలకు నీటిలో పైరు ఉండటంతో పాడైందని శాస్త్రవేత్తలు నివేదిక ఇచ్చారు. ఈ పంటలను కాటుక, మానుకొండ, అగ్గితెగులు ఆశించినట్లు జయశంకర్ వర్సిటీ పరిశోధన సంచాలకుడు జగదీశ్వర్ చెప్పారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి కూడా కొన్ని గ్రామాలకు వెళ్లి వర్షాలకు పాడైన వరి, ఇతర పంటలను పరిశీలించారు.
ఇదీ చూడండి: దసరా వేళ బస్సులు లేక ప్రయాణికులు ఇక్కట్లు