Janasena Alliance: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేనాని పవన్ కల్యాణ్ కీలకవ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో జనసేన పుంజుకుంటుందని.. ఈ క్రమంలో వివిధ పార్టీలు జనసేనతో పొత్తుకోరవచ్చన్నారు. మిగతా పార్టీల మైండ్‌గేమ్‌లో జనసైనికులు పావులుగా మారవద్దని సూచించారు. ఇప్పటికే జనసేన, భాజపా పొత్తులో ఉన్నాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే విషయాన్ని పార్టీ కార్యకర్తలు తన నిర్ణయానికే వదిలేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. పొత్తుల విషయంలో తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని... ప్రతి జనసేనాని ఆలోచనలు, అభిప్రాయాలు తీసుకున్నాకే.. 2024 ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయించుకుందామని పేర్కొన్నారు. అప్పటివరకు శ్రేణులంతా ఒకటే మాటమీద ఉండాలని పవన్ సూచించారు. జనసేన కార్యనిర్వాహక సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ కల్యాణ్.. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టాలని సూచించారు.
మార్చి 14న ఆవిర్భావ సభ..
గతేడాది కొవిడ్ కారణంగా పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించుకోలేదని.. ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పవన్ వెల్లడించారు. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కమిటీ దిశానిర్దేశం మేరకు మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ ఉంటుందని తెలిపారు. ఆ సభలో 2024 ఎన్నికలకు కావల్సిన ఆలోచనలు చేయనున్నట్లు పార్టీ శ్రేణులకు వివరించారు. సంక్రాంతి తర్వాత మరోసారి పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఇదీచూడండి: CBN Video: జనసేనతో తెదేపా పొత్తుపై.. చంద్రబాబు చమత్కారం..