అవసరం లేకున్నా సరే... ‘ఉచితం’ పేరుతో జలమండలికి కొందరు రూ.కోట్లలోనే టోకరా పెడుతున్నారు. పైపులైన్లు లేని బస్తీలు, కాలనీలకు ఉచితంగా నీటి సరఫరా చేస్తున్నట్లు చెబుతూ... బయట విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందా బయట పడటంతో జలమండలి ఫిల్లింగ్ స్టేషన్ ఇన్‌ఛార్జిలతోపాటు ఇద్దరు అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. ఈ తతంగం వెనుక కొందరు వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తూ చక్రం తిప్పుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. వీటికి చెక్ పెట్టేందుకు అవసరం లేని చోట ఉచిత ట్యాంకర్లకు మంగళం పాడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కచ్చితంగా అవసరమైన ప్రాంతాలకు మాత్రమే ఉచిత ట్యాంకర్లను సరఫరా చేయనున్నారు. రెన్యువల్ గడువు ముగిసిన తర్వాత వాటిని కొనసాగించకూడదని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉదాహరణకు కాటేదాన్ పారిశ్రామిక వాడ ప్రాంతంలో రోజుకు 30-40 ఉచిత ట్రిప్పులు సరిపోతాయి. ఇక్కడ ఏకంగా 500-600 ట్రిప్పులు వేసినట్లు గుర్తించారు. జలమండలి నుంచి ఉచితంగా నీరు తీసుకొని వాటిని పారిశ్రామిక అవసరాలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
కొందరి చేతుల్లోనే..
ముఖ్యంగా కొందరు వ్యక్తులు కింది స్థాయి అధికారులను ప్రసన్నం చేసుకొని ఉచితం పేరుతో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు నిగ్గు తేల్చారు. కార్మికుల సంక్షేమం ముసుగులో చక్రం తిప్పుతున్న ఓ వ్యక్తి ఏకంగా పది ట్యాంకర్లు నడుపుతున్నట్లు తెలుస్తోంది. మరో వ్యక్తిదీ ఇదే బాపతు. ఆయన ఆధ్వర్యంలో 7-10 ట్యాంకర్లు తిప్పుతున్నారు. బినామీ పేర్లతో మరికొంతమంది వ్యాపారం కొనసాగిస్తున్నారు. తాజాగా కాటేదాన్ పారిశ్రామిక వాడలో అక్రమాలకు పాల్పడిన ట్యాంకర్ల యజమాని ఓ పార్టీ నేత కావడం విశేషం.
ఇదీ చూడండి: నెట్ లేకున్నా డిజిటల్ చెల్లింపులు.. త్వరలో దేశవ్యాప్తంగా..