జీహెచ్ఎంసీ వెలుపల ఉన్న ఓఆర్‌ఆర్ గ్రామాలకు ఇప్పటికే సరఫరా చేస్తున్న నీటికంటే అదనంగా 50ఎంఎల్డీల నీటిని కేటాయిస్తున్నట్లు జలమండలి ఎండీ దాన కిశోర్ వెల్లడించారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కేటాయించిన ఈ నీటితో 56వేలకు పైగా కుటుంబాల ఇక్కట్లు తీరనున్నాయని దాన కిశోర్ తెలిపారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఓఆర్‌ఆర్ ఓ అండ్ ఎం, ట్రాన్స్మిషన్ ఉన్నతాధికారులతో జలమండలి ఎండీ సమావేశమయ్యారు. జలమండలి పరిధిలోని జీహెచ్ఎంసీ వెలుపల, ఓఆర్ఆర్ లోపల మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 17 గ్రామ పంచాయతీల్లో మొత్తం 193 గ్రామాలు ఉన్నాయన్నారు.
ప్రస్తుతం వీటిల్లో కొన్ని ప్రాంతాలకు రోజు విడిచి రోజు, మరి కొన్ని ప్రాంతాల్లో మూడు నుంచి 5 రోజులకొకసారి నీటి సరఫరా జరుగుతుందని... దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని దాన కిశోర్ వివరించారు. ఈ సమస్యను తీర్చడానికి ఆయా ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారని దాన కిషోర్ వివరించారు. రేపటి నుంచే ఈ సరఫరాను ప్రారంభించాలని.. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను దాన కిశోర్ ఆదేశించారు. దీని కోసం ఆయా ప్రాంతాల్లో మంచినీటి సరఫరాను మెరుగుపర్చడానికి కొత్త పైప్ లైన్ నిర్మాణం, మరికొన్ని ప్రాంతాల్లో ఫీడర్ మెయిన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: KTR: ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీతో ఏం లాభం జరిగింది..?