జలాశయాలు నిండుకుండల్లా మారడం వల్ల గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి ఇంటికి పుష్కలంగా తాగునీరు అందించాలని నిర్ణయించింది జలమండలి. నగరవ్యాప్తంగా ప్రస్తుతం ఇస్తున్న సరఫరాకు దాదాపు 270 మిలియన్ లీటర్లు అదనపు సరఫరా పెంచింది. మొత్తంగా నిత్యం 2,375 మిలియన్ లీటర్ల జలాలను ఇంటింటికి తరలిస్తోంది. గతంలో సన్నధారతో వచ్చే ఇళ్లకు సరిపడా నీరు అందుతోంది.
ప్రధాన నగరంలో ఇప్పటికే రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. శివార్లలోని మున్సిపాలిటీలతోపాటు అవుటర్ రింగ్ రోడ్డులోని పలు గ్రామాలకు 3-5 రోజులకు ఒకసారి తాగునీటిని అందిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు, జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లు పూర్తిగా నిండాయి. అడుగంటిన సింగూరు, మంజీరా ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి.
ప్రస్తుతం కృష్ణా, ఎల్లంపల్లి(గోదావరి), సింగూరు, మంజీరా, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నుంచి నీటిని నగరానికి తరలిస్తున్నారు. తద్వారా గ్రేటర్‌లోని అన్ని ప్రాంతాలకు ప్రధాన నగరంలో మాదిరిగా రోజు విడిచి రోజు నీటి సరఫరా అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో చాలా ప్రాంతాల వాసులకు తాగునీటి బెంగ తీరనుంది. ఇటీవలి వరకు కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఆల్వాల్ తదితర ప్రాంతాల్లోని కొన్ని బస్తీల్లో నీటి కష్టాలు నెలకొన్నాయి. 3-5 రోజులకు ఒకసారి తాగునీటిని అందిస్తుండటంతో నీటిని నిల్వ చేసుకొని వాడేవారు. ఇకపై రోజు విడిచి రోజు ఇవ్వడం వల్ల ఈ బాధ తప్పనుంది. నీటి వృథా తగ్గడంతోపాటు, కలుషిత జలాల సరఫరా నుంచి విముక్తి లభించనుంది.
ఒక్కొక్కరికి 150 లీటర్లు!
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మెట్రో నగరాల్లో ప్రతి వ్యక్తికి నిత్యం 150 లీటర్ల నీటిని సరఫరా చేయాలి. ప్రధాన నగరంలో అంతకు ఎక్కువే అందుతోంది. శివారు మున్సిపాలిటీలు, అవుటర్ రింగ్‌రోడ్డు పరిధిలోని గ్రామాలకు 70-100 లీటర్లు మాత్రమే ఉంది. అదనపు జలాల సరఫరాతో ప్రతి ఒక్కరికి 150 లీటర్ల వరకు అందించే అవకాశం ఏర్పడుతుందని అంటున్నారు. వచ్చే రెండేళ్ల వరకు నగర తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.
ఇవీ చూడండి: 'మిగులు జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌కు వెళ్లవచ్చు'