IT raids at Mallareddy Properties : రెండున్నర రోజులపాటు ఉత్కంఠ సృష్టించిన మంత్రి మల్లారెడ్డి ఇంట్లో, సంస్థల్లో బంధువుల ఇళ్లల్లో ఐటీ దాడులు ముగిశాయి. గడిచిన 3 రోజులుగా కొనసాగిన ఈ సోదాలు.. ఈ మధ్యాహ్నం ముగిసినట్లు ఆదాయపన్నుశాఖ వర్గాలు వెల్లడించాయి. 400 మంది అధికారులు, సిబ్బందితో... 65 బృందాలుగా ఏర్పడి నిర్వహించిన తనిఖీలు రెండున్నర రోజులపాటు కొనసాగాయి. పలు చోట్ల కీలకమైన దస్త్రాలు స్వాధీనం చేసుకోవడంతోపాటు.. నగదు, బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు.
IT raids ended at Mallareddy Properties : బ్యాంకు లాకర్లు కొన్నింటిని తెరచినప్పటికీ మరికొన్ని తెరవాల్సి ఉందని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న దస్త్రాలను.. పరిశీలన చేయగా అక్రమ లావాదేవీలు ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. ప్రధానంగా ట్రస్టు కింద నడుస్తున్న విద్యాసంస్థల్లో... నిర్దేశించిన ఫీజులు కంటే ఎక్కువ వసూలు చేసిన ఆధారాలు లభించినట్లు పేర్కొన్నాయి. ప్రధానంగా నిర్దేశిత ఫీజు కంటే ఎక్కువ వసూలు చేసిన మొత్తాలను.. నగదు రూపంలో తీసుకున్నట్లు తెలిపాయి. ఆ మొత్తాన్ని స్థిరాస్థి వ్యాపారం, మల్లారెడ్డి-నారాయణ రెడ్డి ఆస్పత్రులకు... మళ్లించినట్లు ప్రాథమికంగా బయట పడినట్లు వెల్లడించాయి.
మల్లారెడ్డి వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఇప్పటి వరకు పరిశీలించిన మేరకు.. వస్తున్నఆదాయానికి.. చెల్లిస్తున్న పన్నులకు తేడా ఉన్నట్లు గుర్తించినట్లు ఐటీ వర్గాలు వివరించాయి. మల్లారెడ్డి ఇల్లు, ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లల్లో... కుమారులు, అల్లుడు ఇళ్లలో... విద్యాసంస్థలు, అస్పత్రులు కార్యాలయాల్లో, వాటికి సంబంధించిన డైరెక్టర్లు, సీఈవోల ఇళ్లలోనూ... తనిఖీలు నిర్వహించాయి. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న వాటికి సంబంధించి మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులకు సమన్లు జారీ చేసినట్లు తెలిపాయి. ఈ నెల28, 29 తేదీల్లో హాజరై వివరణ ఇవ్వాలని ఐటీ వర్గాలు ఆదేశించినట్లు వెల్లడించాయి. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు.. తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను అన్నింటిని అసెస్‌మెంట్ విభాగానికి అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు మంత్రి మల్లారెడ్డి, ఐటీ అధికారులు... పరస్పర ఫిర్యాదులపై.. పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో.. పలు సెక్షన్ల కింద... పోలీసులు కేసులు నమోదు చేశారు. భద్రారెడ్డి ఫిర్యాదుతో ఐటీ అధికారి రత్నాకర్ పై... కేసు నమోదయ్యింది. రెండు ఫిర్యాదులపై ఇప్పటికే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బోయిన్ పల్లి పోలీసులు... జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దుండిగల్ పీఎస్‌కు బదిలీ చేశారు.