కృత్రిమ మేధ విభాగంలో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం గతేడాది తీసుకున్న ఇయర్ ఆఫ్ ఏఐ ఇన్షియేటివ్ ఎంతగానో దోహదపడిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రగతిభవన్‌లో ఐటీశాఖ అధికారులతో కలిసి ఏఐ సక్సెస్ రిపోర్ట్‌ను మంత్రి విడుదల చేశారు. కొవిడ్ మహమ్మారి సమయంలో రాష్ట్రం ఎదుర్కొన్న సవాళ్లు అధిగమించడంలో, ఏఐ సాంకేతికతకు రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు ఈ చర్య ఎంతగానో ఉపయోగపడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. 2020ను కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించి 120కి పైగా ఈవెంట్లు, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, ఐఐటీ-హైదరాబాద్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, అమెజాన్ వంటి సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు.
ఏఐ ఫ్రేమ్ వర్క్‌లో భాగంగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, లా ఎన్‌పోర్స్‌మెంట్ రంగాల్లో అప్లైడ్ ఏఐ సొల్యుషన్స్ ఎంతగానో దోహదపడినట్లు రిపోర్ట్ పేర్కొంది. కృత్రిమ మేధ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేలా.. ఇయర్ ఆఫ్ ఏఐ స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని మంత్రి పేర్కొంటూ.. ఈ ఎకోసిస్టంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండి: 'కేంద్ర నిధులతోనే పంచాయతీల్లో అభివృద్ధి.. కేసీఆర్ ఇచ్చింది శూన్యం'