టైమ్స్ నెట్‌వర్క్ నిర్వహించిన యాక్షన్ ఫర్ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర, కేంద్రంతో సంబంధాలు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం మరింత ఉదారంగా వ్యవహరించాలని హితవు పలికారు. జీఎస్టీ బకాయిలపై సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారని, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నారు.
హామీని నిలబెట్టుకోవాలి..
చట్టం ప్రకారం వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు.. తెలంగాణకు నిరాశాజనకంగా, అసంబద్ధంగా ఉందన్నారు. పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానం కూడా చూశామన్నారు. హక్కుగా రావాల్సిన దాని కంటే ఎక్కువ ఇచ్చినట్టు నిర్మలాసీతారామన్ చెప్పారని మంత్రి తెలిపారు. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
లక్షా 60వేల కోట్ల వ్యత్యాసం
ఐదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.2.70 లక్షల కోట్ల పన్ను ఆదాయంలో ఇచ్చామని.. తెలంగాణకు తిరిగిచ్చింది రూ.లక్షా 15 వేల కోట్లే మాత్రమేనని తెలిపారు. దాదాపు రూ.లక్షా 60వేల కోట్ల వ్యత్యాసం ఉందన్నారు. దేశ నిర్మాణానికి తెలంగాణ ప్రజలు పన్నులు చెల్లించారని పేర్కొన్నారు. ఏదో ఇచ్చామని కేంద్ర పెద్దలు చెప్పడం మంచిది కాదన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు మరింత బలపడతాయన్నారు. సీఎం కేసీఆర్ చెప్పే నిజమైన ఫెడరల్ స్ఫూర్తితో దేశం నడిచే రోజు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఉన్నవి చిన్న, పెద్ద ప్రాంతీయ పార్టీలే తప్ప జాతీయ పార్టీలు లేవన్నారు.
ఇదీ చూడండి : కేంద్రంపై పోరుకు కాంగ్రెస్ సమాయత్తం!