హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ ప్రకాశ్ మొక్కలు నాటారు. కాలుష్య నివారణకు మొక్కలు నాటడమే ఉత్తమమైన మార్గమని ముఠా గోపాల్ అన్నారు. హరితహారంలో భాగంగా నగర కేంద్ర గ్రంథాలయం ఆవరణలో ఎమ్మెల్యే సహా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్, కార్పొరేటర్ పద్మ , డీఎంసీ ఉమా ప్రకాష్ మొక్కలు నాటి చెట్లకు నీళ్లు పోశారు. సమాజంలో కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని మొక్కలు నాటాలని సూచించారు.
వాటిని పెద్ద ఎత్తున నాటాలి..
పెరుగుతున్న వాయు కాలుష్యం దృష్ట్యా కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రజలందరూ మొక్కల సంరక్షణ చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. కొత్త మొక్కలను పెద్ద ఎత్తున నాటాలని సూచించారు. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్కులు లేకుండా బయటకు రాకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో లక్ష్మీ గణపతి దేవాలయం ఛైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది, తెరాస గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు ముఠా నరేశ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.