Irrigation Projects Issue In Telangana : రాష్ట్రంలో వివిధ సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాల్లో 90 శాతానికి పైగా ఖర్చయినా అందుకు తగ్గట్టుగా ఆయ కట్టుకు మాత్రం నీరు అందించలేని పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టు లక్ష్యంలో 50 నుంచి 60 శాతానికి సైతం నీరు పారట్లేదు. ఈ పనులకు సంబంధించిన భూసేకరణ చేయకపోవడమే ప్రధాన కారణంగా సంబంధిత ఇంజినీర్లు, అధికారులు ఇటీవలె ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
ఆశించినంత నీరు లేక ప్రాజెక్టులు వెలవెల - యాసంగి సాగుకు తిప్పలు తప్పేట్టులేవుగా
Land Acquisition Problems For Projects : వివిధ సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అపారంగా ఖర్చు చేసినా లక్ష్యానికి తగ్గట్లుగా పొలాలకు నీరు అందటం లేదు. ప్రాజెక్టు ప్రధాన పనులపై చూపిన శ్రద్ధ ఆయకట్టుకు నీరు అందించే పనులపై చూపకపోవడం, భూసేకరణకు నిధులు ఇవ్వకపోవడం, ఇచ్చిన చోటా పనులు పెండింగ్‌లో ఉండటమే ఇందుకు కారణాలుగా తెలుస్తోంది.
పదేళ్లలో సాగునీటి రంగానికి ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసింది. అందులో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకొన్న రుణాలు కలిపి ఉన్నాయి. రాష్ట్రంలో చేపట్టిన 18 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల్లో అత్యధికం 90 శాతానికి పైగా పూర్తి కాగా కొన్ని 50 నుంచి 75 శాతం వరకు, కొన్ని 50 శాతం వరకు పనులు పూర్తయ్యాయి.
Projects Incomplete Works in Telangana : ఆయకట్టుకు వచ్చేటప్పటికి 57 లక్షల ఎకరాలకుగాను 12 లక్షల ఎకరాలకు నీరందించే పనులే పూర్తి అయ్యాయి. మరో 45 లక్షల ఎకరాలకు నీరందించే పనులు ఇంకా కావాల్సి ఉంది. ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి 4 లక్షల ఎకరాలు అవసరం కాగా మూడు లక్షల 55 వేలు సేకరించారు. మరో 46 వేల ఎకరాలు సేకరించాల్సి ఉంది.
జల యజ్ఞంలో భాగంగా 2004లో పనులు ప్రారంభించిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, దేవాదుల, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టులతో పాటు 2014 తర్వాత పునరాకృతి ద్వారా చేపట్టిన కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల తదితర ప్రాజెక్టులున్నాయి. భీమా ఎత్తిపోతల కింద ఇంకా సేకరించాల్సిన భూమి 208 ఎకరాలుగా ఉందని సంబంధిత ఇంజినీర్లు నివేదించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మాత్రం 100 శాతం ఖర్చైంది. ఓ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
Telangana Irrigation Projects Works : దేవాదుల ఎత్తిపోతల పథకం కింద అదే పరిస్థితి. ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ఖర్చు రూ.9 వేల కోట్ల నుంచి రూ.16 వేల కోట్లకు పెరిగింది. ఇప్పటివరకు 13 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. అయినా మూడోవంతు ఆయకట్టుకు నీరందించే పనులు పూర్తి కాలేదు. పూర్తయినట్లు చెబుతున్న చోటా సమస్యలున్నాయి. కొన్ని చోట్ల చెరువులు మాత్రమే నింపారు. అన్ని ప్రాజెక్టుల పరిధిలోనూ భూముల ధరలు అమాంతం పెరిగడంతో భూసేకరణ వ్యయం మరింత పెరగనుంది. పూర్తిగా భూమిని కోల్పోయే రైతుకు తగిన ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తే తప్ప ముందుకెళ్లే అవకాశం లేదని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.
Telangana: ఎందుకీ వివక్ష.. మాకో న్యాయం.. కర్ణాటకకో న్యాయమా..?