Irrigation Is Difficult In Yasangi Season : యాసంగిలో ఇచ్చే సాగునీరు విషయమై హైదరాబాద్ జలసౌధలో జరిగిన రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ సమావేశం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. భారీ, మధ్య తరహా, చిన్న నీటిపారుదల కింద సాగునీరు అందించే విషయమై సమావేశంలో చర్చించారు. వర్షాలు లేకపోవడం, ఆశించిన స్థాయిలో వరద రాకపోవడంతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి.
ఆయా ప్రాజెక్టుల కింద వానాకాలం పంటల సాగు కష్టంగా కొనసాగింది. ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల్లో కేవలం తాగునీటి అవసరాల మేరకే నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో మాత్రం నీరు ఉంది. ఆయా ప్రాజెక్టుల్లోని ప్రస్తుతం నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టుల వారీగా యాసంగిలో సాగునీరు అందించే ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
Telangana Irrigation Projects Water Level : ప్రతిపాదనలపై టెరిటోరియల్ వారీగా చీఫ్ ఇంజినీర్లతో ఈఎన్సీ మురళీధర్ చర్చించారు. ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలను పరిగణలోకి తీసుకుని యాసంగిలో ఎంత ఆయకట్టుకు నీరివ్వాలన్న విషయమై ఓ స్పష్టతకు వచ్చారు. 2023-24 యాసంగిలో మొత్తంగా 28.95 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని ఇవ్వాలని నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. నిరుడు యాసంగిలో 33 లక్షల 65 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చారు. ఈ సీజన్‌లో భారీ ప్రాజెక్టుల కింద 18 లక్షల 68 వేల 883 ఎకరాలకు మధ్యతరహా ప్రాజెక్టుల కింద 2 లక్షల 18 వేల 535 ఎకరాలకు చిన్నతరహా వనరుల నుంచి 6 లక్షల 72 వేల 938 ఎకరాలకు ఐడిసి కింద లక్షా 35 వేల 223 ఎకరాలకు నీరు ప్రతిపాదించారు.
ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష - కేంద్రం నిధులు ఏం చేశారని నిలదీత
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 93 ఎకరాలకు నీరు : కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఈ యాసంగిలో 93 వేల 70 ఎకరాలకు నీరు ఇవ్వాలని ప్రతిపాదించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 78.66 టీఎంసీల నీరు ఉంది. 6.50 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించారు. మిగతా నీటిని యాసంగి సాగునీటి అవసరాలకు కేటాయించారు. శీరాంసాగర్ ప్రాజెక్ట్ మొదటి దశ కింద 8 లక్షల 28 వేల 297 ఎకరాలకు రెండో దశ కింద 3 లక్షల 26 వేల 914 ఎకరాలకు సాగునీరు ప్రతిపాదించారు. మధ్య మానేరు కింద 54 వేల 224 ఎకరాలకు, అలీ సాగర్ కింద 48 వేల 282 ఎకరాలకు, గుత్ప కింద 33 వేల 725 ఎకరాలకు, నిజాంసాగర్ కింద లక్షా 24 వేల 825 ఎకరాలకు ఆయకట్టు ప్రతిపాదించారు.
పామాయిల్ సాగులో ప్రభుత్వ సంకల్పానికి అధికారులు చొరవ చూపాలి : తుమ్మల
యాసంగి సీజన్‌లో సాగునీరివ్వలేని పరిస్థితి : మూసీ ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలు, సింగూరు కింద 40 వేల ఎకరాలు, దేవాదుల కింద 2 లక్షల 2 వేల 400 ఎకరాలు, నెట్టెంపాడు కింద 5,000 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రతిపాదించారు. కృష్ణా బేసిన్‌కు ఆశించిన స్థాయిలో వరదలు రాక ప్రాజెక్టుల్లో నీరు లేనందున ఆయా ప్రాజెక్టుల కింద ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ఆయకట్టుకు సాగునీరిచ్చే పరిస్థితి లేదని అధికారులు తేల్చారు. కృష్ణా ప్రాజెక్టులైన నాగార్జున సాగర్, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద యాసంగి సీజన్‌లో సాగునీరివ్వలేని పరిస్థితి ఏర్పడింది.
కేవలం నెట్టెంపాడు కింద 5,000 ఎకరాలకు, మూసీ ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం లభించగానే ప్రాజెక్టుల వారీగా నీటి విడుదల తేదీలను ఖరారు చేసేందుకు సంబంధిత అధికారులు ఇప్పటికే కసరత్తును ప్రారంభించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, వృథాను అరికట్టాలని రైతులకు సూచిస్తున్న నీటిపారుదల శాఖ క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహనా సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది.
Farmer Crying Due to Dying Crops in AP: నీరందక ఎండిన పంట.. కన్నీరుమున్నీరైన రైతు..