గతంలో దేశంలో బెంగాల్ మోడల్, గుజరాత్ మోడల్ అంటూ ఉండేవి... ఇప్పుడు తెలంగాణ మోడల్ అని అందరూ అంటున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారింది. ఆయనకున్న సంపూర్ణ అవగాహన, పట్టుదల, కఠోర శ్రమతో రాష్ట్రం ఘన విజయాలను సాధిస్తూ పురోగమిస్తోంది.
తెలంగాణ దేశానికే ఆదర్శంగా
హైదరాబాద్ జలదృశ్య భవన్‌లో 2001వ సంవత్సరం.. ఏప్రిల్ 27వ తేదీన ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రసమితి.. ఇప్పుడు సుజల దృశ్యాన్ని ఆవిష్కరించే స్థాయికి చేరిందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు అన్నారు. అయిదు విప్లవాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. పార్టీకి ప్రాణం.. ఊపిరి.. కర్త.. కర్మ.. క్రియ ఇలా అన్నీ కేసీఆరేనని ఉద్ఘాటించారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం అందరికీ అదృష్టమని పేర్కొన్నారు. ఎవరి మద్దతు లేకుండా అన్ని స్థాయిల్లో జరిగిన ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచిన పార్టీ దేశంలో బహుశా తెరాస ఒక్కటేనన్నారు. తెరాస 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఆదివారం ‘ఈనాడు’తో ప్రత్యేక ముఖాముఖిలో మాట్లాడారు.
ఇన్నాళ్ల పార్టీ ప్రస్థానం ఎలా సాగింది?
ఒకే లక్ష్యంతో ప్రారంభమైన రాజకీయ పార్టీ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటుండడం అనిర్వచనీయ అనుభవం. ప్రత్యేక తెలంగాణను సాధించుకోవడంతో పాటు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చిరస్మరణీయం. ఒక ఉద్యమకారుడైన కేసీఆర్ పాలనాదక్షునిగా పేరు తెచ్చుకోవడం గొప్ప విషయమని కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ నాతో అన్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించి.. ఆయనే నాయకత్వం వహించడం అరుదైన పరిణామమని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం ప్రశంసించారు. కేసీఆర్‌ను ప్రజలు, కార్యకర్తలు రెండు దశాబ్దాలు నడిపించారు. ఇందులో జయశంకర్, విద్యాసాగర్‌రావు లాంటి మహానుభావులు, మేధావుల పాత్ర కీలకమైంది.
పార్టీ ఆశించిన గమ్యం చేరిందా?
గడిచిన 73 ఏళ్లలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. గట్టిగా నిలిచిన అతికొద్ది పార్టీల్లో తెరాస ఒకటి. ఎన్నో కుట్రలను, అవహేళనలను ఎదుర్కొని ధైర్యంగా సాగుతూ.. ప్రజాజీవితంలో ఆదరాభిమానాలు పొందుతూ అజేయంగా రూపొందింది. ఇదంతా ప్రజలు, కార్యకర్తల దయ, ఆశీర్వాదం వల్లనే సాధ్యమైంది. వారికి పాదాభివందనం చేస్తున్నాను. 60 లక్షల మంది కార్యకర్తలతో తెరాస ఇప్పుడు తిరుగులేని రాజకీయ శక్తిగా మారింది. ప్రభుత్వాన్ని నిర్వహించడంలోనూ తెరాస రాణించింది.
ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానికి దక్కుతుంది. తెలంగాణలో జలవిప్లవం, హరితవిప్లవంతో పాటుపింక్ విప్లవం (మాంసం) నీలి విప్లవం (చేపలు), శ్వేత విప్లవం (పాలు) ఆవిష్కృతమయ్యాయి. గతంలో తూలనాడిన వారు శభాష్ అంటున్నారు. ప్రజలు ప్రతిపక్షాలను వద్దనుకుంటున్నారు. తెలంగాణ విభజన సందర్భంగా ద్వేషించిన లక్షలాది మంది ఈరోజు కేసీఆర్‌ను అత్యధికంగా అభిమానిస్తున్నారు. విభజన అనేది వికాసం కోసమే అన్న విషయాన్ని వారీరోజు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు.
పార్టీ శ్రేణులు ఎలా పనిచేస్తున్నాయి
పార్టీ శ్రేణుల పనితీరు అద్భుతంగా ఉంది. నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. వారు ప్రభుత్వానికి, పార్టీకి, ప్రజల మధ్య సంధానకర్తలుగా పనిచేస్తున్నారు. కార్యకర్తలందరికీ బీమా సౌకర్యం కల్పించాం. అన్ని జిల్లాల్లోనూ తెరాస కార్యాలయాలు సిద్ధమయ్యాయి. ప్రస్తుత సంక్షోభం ముగిశాక వాటి ప్రారంభోత్సవాలతో పాటు కార్యకర్తల శిక్షణపైన కూడా ఆలోచన చేస్తాం.
తెరాసను జాతీయస్థాయి.. ఇతర రాష్ట్రాలకు విస్తరించే యోచన ఉందా..
మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. గతంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, అందులో కీలక పాత్ర పోషించాలని భావించాం. అది వీలు కాలేదు. తెరాస ముద్ర దేశ రాజకీయ యవనికపై స్పష్టంగా కనిపిస్తుంది. మా విధానాలను అనేక రాష్ట్రాలు అవలంబిస్తున్నాయి. రైతు బంధు ప్రేరణే కిసాన్ యోజన.
ఇతర దేశాల్లో ప్రవాస విభాగాలు ఎలా ఉన్నాయి
ప్రవాస తెరాస విభాగాలు రాష్ట్రం కోసం అంకితభావంతో పనిచేస్తున్నాయి. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వారిని ప్రచార రాయబారులుగా వినియోగించుకుంటున్నాం. గల్ఫ్‌లోని కార్మికులను స్వదేశానికి రావాలని కోరుతున్నాం. వ్యవసాయంతో పాటు అన్ని రకాలుగా ఉపాధికి అవకాశం ఉంది.
కరోనా కష్టాన్ని ఎలా అధిగమిస్తారు
కరోనాతో ఆర్థిక, అభివృద్ధిపరంగా ఇబ్బందులుంటాయి. వాటిని అధిగమిస్తాం. ఐటీ తదితర రంగాల్లో మార్పులకు అవకాశం ఉంది. ప్రవాస భాజపాతో, ఎన్డీయే ప్రభుత్వంతో పలు అంశాల్లో విభేదాలున్నా సంక్షోభ సమయంలో రాజకీయాలు చేయరాదన్నది మా భావన.
తెరాస బలాలేమిటి
తెరాసకు ఊపిరి, ప్రాణం.. కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే.. ఇంతగా పార్టీ పటిష్ఠం కావడం. ప్రజల అభిమానం, విశ్వాసం పొందడం రాత్రికిరాత్రి జరిగే పనికాదు. తెలంగాణ పోరాటాన్ని వదిలితే రాళ్లతో కొట్టి చంపండని ఆయన ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారు. శాసనసభలో సీఎంగా నిలబడి నేను చెప్పేదానిలో తప్పుంటే నన్ను.. నేను మాట్లాడింది నిజమైతే.. ప్రతిపక్షాన్ని ఓడించండని సవాలు చేసిన గొప్ప నాయకుడు.
ఆయన 40 సంవత్సరాలు ప్రజాజీవితంలో ఉన్నారు. తెలంగాణ కోసం యూపీఏ ప్రభుత్వం మద్దతు లేఖలు కావాలనే సాకు చెబితే.. పార్లమెంటులోని 42 పార్టీల్లో 36 పార్టీల మద్దతు సమీకరించారు. నాగ్‌పుర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన కేసీఆర్... సీపీఐ ప్రధాన కార్యాలయమైన అజయ్‌భవన్‌కు వెళ్లి వచ్చారు. ఆయన చిత్తశుద్ధి నాయకత్వమే పార్టీకి, రాష్ట్రానికి శ్రీరామరక్ష. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేయకపోయినా.. ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టారు.
ఆవిర్భావ దినాన మీరిచ్చే సందేశం
సుమారు రెండు దశాబ్దాలుగా ప్రజల్లో మమేకమైన అనుభవంతో మరోసారి వారి సేవకు పునరంకితమవుతాం. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొంటామన్న ఏకైక సీఎం కేసీఆర్. దీనిపైనా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి. ఇప్పట్లో ఎన్నికలు లేవు. ఎన్నో అంశాలపై మాకు ప్రణాళికలున్నాయి.
ప్రస్తుత కరోనా కల్లోలంలో సీఎం కేసీఆర్ దీక్షాదక్షత, మార్గదర్శనం చూసిన తర్వాత మరో 15, 20 ఏళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని అందరూ కోరుకుంటున్నారు. అందులో నేనూ ఒకడిని. కేసీఆర్ ప్రెస్‌మీట్ అంటే అనేక మంది ఆసక్తిగా ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఈ విషయమై ఫోన్‌లు చేసి అడుగుతుంటారు.
ఎక్కడా చేయని పథకాలు రాష్ట్రంలో అమలు పరుస్తున్నాం. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, నీటి ప్రాజెక్టుల నిర్మాణం, గోదాముల సామర్థ్యం 24 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం... ఇలా ప్రతి అంశం మీద కేసీఆర్ ముద్ర ఉంది. వ్యవసాయం, సాగు, తాగునీటి రంగం, కులవృత్తులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలపై దేశంలో ఏ నాయకునికీ లేని పట్టు ఆయనకు ఉంది. ప్రస్తుతం కేసీఆర్ పాలనకు ముందు.. తర్వాత అని ప్రతి ఒక్కరూ ఆలోచించే పరిస్థితి నెలకొంది.
ఇదీ చదవండి: కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం