ప్రైవేట్ జూనియర్ కళాశాలల గుర్తింపు ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఆరు మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలకు అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ ఉండాలన్న నిబంధనలను సడలించింది. పదిహేను మీటర్ల వరకు భవనాలు అగ్నిమాపక శాఖ జాగ్రత్తలు తీసుకొని స్వీయ పూచీకత్తు ఇస్తే చాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరిలో జారీ అయిన నిబంధనల ప్రకారం.. ఆరు మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న భవనాల్లో జూనియర్ కళాశాల నిర్వహణకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే ఆ నిబంధన ప్రకారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పదిహేను వందలకు పైగా కళాశాలల్లో కేవలం 77కి మాత్రమే ఇప్పటివరకు అనుబంధ గుర్తింపు లభించింది. అనుబంధ గుర్తింపు ప్రక్రియ కోసం కళాశాలలు ఇంటర్ బోర్డుకు ఆన్ లైన్లో దరఖాస్తులు సమర్పించినప్పటికీ.. అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ లేకపోవడం వల్ల.. అనుబంధ గుర్తింపు ప్రక్రియ పెండింగ్లో నిలిచిపోయింది.
90 శాతం నిబంధనలకు అనుగుణంగా లేవు
భవనాల నిర్మాణం, వైశాల్యం తదితర అంశాలు నిబంధనల ప్రకారం ఉంటేనే.. అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ జారీ చేస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న సుమారు 90 శాతానికి పైగా కాలేజీ భవనాలు నిబంధనలకు అనుగుణంగా లేవు. గతంలో ఇలాంటి ప్రతిష్టంభన వచ్చినప్పుడు 15 మీటర్ల ఎత్తు వరకు మినహాయింపు ఇస్తూ 2017లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే పలు కార్పొరేట్ కళాశాలలు అగ్నిమాపక శాఖ ఎన్వోసీ లేకుండా కళాశాలలు నిర్వహిస్తున్నాయని గతేడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ సందర్బంలో 15 మీటర్ల వరకు మినహాయింపును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో ఈ ఏడాది గందరగోళంగా మారింది.
15మీ. కన్నా ఎక్కువ ఎత్తులో ఉంటే..
ఓ వైపు విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడం.. మరోవైపు అనుబంధ గుర్తింపు ప్రక్రియ స్తంభించడం వల్ల మినహాయింపు ఇవ్వాలని ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వాన్ని కోరాయి. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చించి నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు హోంశాఖ జీవో 29 జారీ చేసింది. పదిహేను మీటర్ల లోపు ఎత్తు ఉన్న భవనాలు అగ్నిమాపక యంత్రాలు, ప్రథమ చికిత్స పరికరాలు, నీళ్లు, పంపు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఒక అంతస్తులో 500 చదరపు అడుగులకు మించి విస్తీర్ణం ఉండి.. ఒకే చోట మెట్లు ఉంటే మరో చోట కూడా మెట్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. ఈ నిబంధనలు పాటించి సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. పదిహేను మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్న భవనాలకు మాత్రం కచ్చితంగా అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ ఉండాలని స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: సమస్యల పరిష్కారం కోసం మంత్రిని కలిసిన టీఎన్టీవో నేతలు