రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు అందించాలని ఇంటర్ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఛానల్ టీశాట్, ఇంటర్‌బోర్డు యూట్యూబ్ ఛానల్ తదితర వాటిని ఇందుకోసం వినియోగించుకోవాలని కమిషనర్ జలీల్ భావిస్తున్నారు. దీనిపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌తో బుధవారం జరిగే సమీక్ష సమావేశంలో చర్చించనున్నారు.
జూన్ రెండో వారంలో ఫలితాలు
ఇంటర్ మూల్యాంకనం, ఫలితాల విడుదలతో పాటు కళాశాలల పునఃప్రారంభంపై ఆమె సమీక్షిస్తారు. మరో రెండు మూడు రోజుల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి కానుంది. గతంలో విద్యాశాఖ మంత్రి ప్రకటించినట్లు జూన్ రెండో వారంలో ఫలితాలు వెల్లడించనున్నారు. మొదట ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఇస్తామని వెల్లడించినా తాజాగా ప్రథమ సంవత్సరం ఫలితాలను కలిపి ఇవ్వాలని యోచిస్తున్నారు.
కళాశాల పునఃప్రారంభంపై నివేదిక
ఇక కళాశాలల పునఃప్రారంభంపై ఇంటర్‌బోర్డు అధికారులు, ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకురాలు శేషుకుమారి, పాఠశాల విద్యాశాఖ మాజీ అదనపు సంచాలకుడు గోపాల్‌రెడ్డి తదితరులతో నియమించిన కమిటీ ఈ నెల 30వ తేదీ లోపు నివేదిక అందించనుంది. పదో తరగతి పరీక్షల ఫలితాలు జులై 20 నాటికి వెలువడితే ఆగస్టు మొదటి వారంలో ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రెండో ఏడాది తరగతులు మాత్రం జులైలోనే ప్రారంభిస్తారు.