Biometric Attendance in Junior Colleges: గృహ, వాణిజ్య మిశ్రమ సముదాయాల్లో నడుస్తున్న జూనియర్ కాలేజీలకు రెండేళ్ల పాటు అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రం మినహాయింపునివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు హోంశాఖ మంత్రిని కోరనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మిశ్రమ సముదాయాల్లోని జూనియర్ కాలేజీలకు అగ్నిమాపక ఎన్ఓసీ ఉంటే ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపునిస్తుంది. సుమారు 340 కాలేజీలకు అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ లేనందున అనుబంధ గుర్తింపును ఇంటర్ బోర్డు పెండింగులో పెట్టింది. అయితే ఆ కళాశాలల్లో వేల మంది విద్యార్థులు చేరి తరగతులకు హాజరవుతున్నారు. ఆ విద్యార్థులను ప్రైవేట్‌గా పరీక్షలు రాయించాలని భావించినప్పటికీ.. గందరగోళానికి దారితీస్తుందని భావించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్ఓసీ మినహాయింపునివ్వాలని నిర్ణయించారు.
ఇక నుంచి బయోమెట్రిక్ హాజరు: నాంపల్లిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఇంటర్మీడియట్ విద్యా మండలి సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇంటర్ లో సిలబస్ మార్పులు చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
ప్రతీ ఏటా పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యంపై చర్చించిన ఇంటర్ బోర్డు... ఇక నుంచి పదో తరగతి ఫలితాలు వెలుపడే నాటికే పుస్తకాలను సిద్దం చేయాలని నిర్ణయించింది. ఇప్పటి నుంచే పుస్తకాల ప్రచురణ ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ద్వితీయ భాష జవాబు పత్రాలతో ఆన్ లైన్ మూల్యాంకనాన్ని ప్రయోగాత్మకంగా ఈ ఏడాది మొదలు పెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. కరోనా కాలంలో జరిగిన ఆన్లైన్ బోధన విధానానికి ఇంటర్ బోర్డు ఆమోద ముద్ర వేసింది. గతంలో తీసుకున్న పాలనపరమైన నిర్ణయాలనూ ఆమోదించింది. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు ఇంచార్జి కమిషనర్ నవీన్ మిత్తల్, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: